నేడు శ్రీలంకతో భారత్ అమీతుమీ
- సెమీస్ చేరాలంటే గెలుపు తప్పనిసరి
- మహిళల టీ20 ప్రపంచకప్
* ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో సునాయసంగా సెమీస్ గడప తొక్కుతారని అనుకున్న హర్మన్ సేన టోర్నీ మొదటి పోరులోనే చేతులెత్తేసి కష్టాలు కొనితెచ్చుకుంది. ఆ తర్వాత తేరుకుని దాయాది పాక్‌పై గెలిచి బోణీ కొట్టింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో నేడు లంకతో పోరుకు సిద్ధమైంది. జూలైలో జరిగిన ఆసియా కప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ప్రతీకార పోరులో హర్మన్ సేన లంకను కుమ్మేస్తారా లేక చతికిలపడతారా అన్నది చూడాలి..
విజయక్రాంతి ఖేల్ విభాగం:
టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు నేడు శ్రీలంకతో తలపడనుంది. ఈసారి కప్ గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన హర్మన్ సేనకు ఆదిలోనే కివీస్ రూపంలో హంసపాదు ఎదురైంది. అయితే ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గెలి చి లెక్క సరిచేసినప్పటికీ ఈ ఒక్క విజయం సరిపో దు. అసలే మేటి జట్లు ఉన్న గ్రూప్‌లో ఉన్న హర్మన్ సేన సెమీస్ చేరేలాంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంది.
పాక్‌పై గెలిచినప్పటికీ భారత్ రన్‌రేట్ ( మైనస్‌లో ఉండడంతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ నేపథ్యం లో లంకపై భారీ విజయం సాధించడంతో పాటు రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ లంకపై విజయం సాధించినప్పటికీ సెమీస్ చేరే క్రమంలో రన్‌రేట్ కీలకంగా మారనుంది. మరి హర్మన్ సేన ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
బ్యాటింగ్‌లో వైఫల్యం
ఈ ప్రపంచకప్‌లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతి లో 58 పరుగుల తేడాతో ఓడడం.. పాక్‌పై గెలిచినప్పటికీ 105 పరుగుల సునాయాస లక్ష్యాన్ని అందు కోవడానికి 18.5 ఓవర్లు ఆడడం అందరిని విస్మయపరిచింది. ఈ రెండింటిలో కామన్ పాయింట్ బ్యాటర్ల వైఫల్యం. ముఖ్యంగా భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ దారుణంగా విఫలమయ్యారు.
మంధాన రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7 పరుగులు చేయగా.. షెఫాలీ వరుసగా 2, 32 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు సరిగ్గా ఆడకపోవడంతో మిడిలార్డర్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో మిడిల్ ఓవర్లలో పరుగులు రాక భారత్ ఇబ్బంది పడుతోంది. పాక్‌తో మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ హర్మన్ లంకతో మ్యాచ్‌లో ఆడుతుందా అన్నది అనుమానంగా మారింది.
రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ రాణించాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌లో భారత్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌లో అరుంధతీ రెడ్డి 3 వికెట్లు తీసి ఫామ్‌లోకి రాగా రేణుకా సింగ్, పూజాలు కీలకం కానున్నారు. ఇక స్పిన్ విభాగంలో శ్రేయాంక, లెగ్ స్పిన్నర్ ఆశా శోభన తమ పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు.
బదులు తీర్చుకునేనా?
జూలైలో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో (టీ20 ఫార్మాట్) భారత్‌కు చెక్ పెట్టిన లంకేయులను తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. ఆ టోర్నీలో ఓటమనేదే లేకుండా ఫైనల్‌కు చేరిన హర్మన్ సేనపై ఫైనల్లో లంక విజయం సాధించి ఆసియా కప్‌ను ఎగరేసుకుపోయింది. శ్రీలంక జట్టులో కెప్టెన్ చమేరి ఆటపట్టు చాలా కీలకం. ఆమెను త్వరగా ఔట్ చేయడం చాలా ముఖ్యం. అయితే ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లో ఆటపట్టు 6, 3 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచింది.
ర్యాంకింగ్స్‌లో హర్మన్ జోరు
ఐసీసీ విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాలుగు స్థానాలు ఎగబాకి లంక బ్యాటర్ హర్షిత సమరవిక్రమతో కలిసి సంయుక్తంగా 12వ స్థానంలో నిలిచింది. మంధాన ఒక స్థానం దిగజారి ఐదో స్థానంలో, రోడ్రిగ్స్ 20వ స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో శ్రేయాంక పాటిల్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 29వ స్థానంలో నిలవగా.. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నాలుగో స్థానానికి దిగజారింది. రేణుకా సింగ్ తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.