గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని బ్రహ్మంగారి గుట్టపై కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 416వ జయంతిని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, కలశారాధన, వీరబ్రహ్మేంద్రస్వామికి షోడష ఉపచారపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా బ్రహ్మంగారి గుట్ట వద్ద గజ్వేల్ ప్రాంత ప్రజలు స్వామివారిని ఆరాధిస్తున్నారని తెలిపారు. కలియుగంలో భవిష్యత్తులో సమాజ పరిస్థితులను, జరగబోయే సంఘటనలను కాలజ్ఞానం ద్వారా వివరించడంతో పాటు సమాజంలోని కులమత బేధాలను నిర్మూలించడంలో వీరబ్రహ్మేంద్రస్వామి ముఖ్యపాత్ర వహించారన్నారు. కలి ప్రభావానికి గురికాకుండా ఉండాలంటే వీరబ్రహ్మేంద్రస్వామి సూచించిన మార్గంలో ప్రజలు నడవాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ పట్టణంతో పాటు, ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.