calender_icon.png 21 November, 2024 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు మార్చడం దారుణం

24-09-2024 04:30:48 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలుగు విశ్వ విద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును యధావిధంగా కొనసాగించాలని తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా రాజకీయ కమిటీ చైర్మన్ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి తెలుగు భాషాభిమానుల అభిమానం చూరగొన్న అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయం నుండి తొలగించడం బాధాకరమని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అంతటి మహనీయుని పేరును తొలగించే విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు.

పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని దేశం గర్వించదగ్గ నాయకుడని హరిజనుల దేవాలయాల ప్రవేశాలపై, సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షతను రూపు మాపటానికి తీవ్రంగా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు, అటువంటి మహనీయుని పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల ఆర్యవైశ్యులు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఈగ నాగన్న, కోశాధికారి మాశేట్టి వెంకన్న, భవన సంఘ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి, తల్లాడ శ్రీనివాస్, తల్లాడ బిక్షం తదితర ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.