calender_icon.png 14 October, 2024 | 2:47 AM

అక్టోబర్‌లో వస్తున్న పొట్టేల్ పిల్ల!

08-10-2024 12:00:00 AM

జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది అనన్య నాగళ్ల. ఈ అమ్మడు ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ చేసేసింది. ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో విడుదలైన  వెబ్‌సిరీస్ ‘బహిష్కరణ’లో పల్లెటూరి యువతిగా సహజ నటనను కనబరిచిన అనన్య నాగళ్ల  మరోమారు గ్రామీణ నేపథ్యం అమ్మాయిగా ‘పొట్టేల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో హీరో యువచంద్రతో జత కట్టిన అనన్య నాగళ్ల తల్లి పాత్రలో కనిపించబోతోంది. పూర్తి డీ గ్లామర్ రోల్‌లో ఆమె కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు సాహిత్ మోత్కూరి ఈ చిత్రాన్ని రూరల్ యాక్షన్ డ్రామాగా నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ పతాకాలపై తెరకెక్కిస్తున్నారు.

నిశాంక్ రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగే నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ సోమవారం ప్రకటించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్లలో యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, వారి కుమార్తె పాత్రలో నటిస్తున్న చిన్నారి ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు; సంగీతం- శేఖర్ చంద్ర.