calender_icon.png 24 October, 2024 | 10:02 AM

కాలానికి ఎదురీదిన...పోతు రాధ

04-06-2024 12:05:00 AM

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడి కుటుంబాల్లో దాదాపుగా యాభై శాతం మంది చేనేత మగ్గాలను నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి జీవనాన్ని సాగించే కుటుంబంలో పుట్టింది పోతు రాధ. కుటుంబంలో నలుగురు అక్క చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు అందరి లో పెద్ద అమ్మాయి రాధ. ఇంట్లో చేతి పని నడిస్తేనే కడుపులోకి ముద్ద వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఐదవ తరగతి వరకు చదివిన తరువాత చదువును తండ్రి మాన్పించాడు. తనకు సహాయంగా చేనేత వృత్తి పనిని నేర్పించాడు.

చదువుని ఆపేసి తండ్రికి ఆసరాగా నిలబడి మగ్గం వర్క్‌ని రాధ చేయడం మొదలు పెట్టింది. అలా మొదలు పెట్టిన పనిని మెల్లగా నేర్చుకుని అందులో నైపుణ్యాన్ని సాధించింది. ఈ క్రమంలో తల్లితండ్రులు రాధకు వివాహం చేశారు. భర్త ఎటువంటి పని చేయకుండా మందుకు బానిస కావడం. గ్రామంలో పని చేయడనే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌కు వలస వెళ్లిన భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కొన్ని రోజులు రాధ హైదరాబాద్‌లోనే ప్లాస్టిక్ కంపెనీలో పని చేసింది. ఒక రోజు భర్త ఎవరికీ చెప్పకుండా తనను వదిలి వెళ్లిపోయాడు.

తిరిగి వస్తాడని ఎదు రు చూసిన ఆమెకు ఎదురు చూపులే మిగిలాయి, కానీ భర్త తిరిగి రాలేదు. అప్పటికే పెద్ద కొడుకు ఆరు సంవత్సరాలు, చిన్న కొడుకు గర్భంలో ఉన్నాడు. అక్కడి నుండి తిరిగి తన స్వగ్రామానికి చేరుకుంది. తన తండ్రితో పాటు చేనేత మగ్గం వర్క్ పనిని తిరిగి ప్రారంభించింది.

కుమారుల అభివృద్ధి కోసం

కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల తన చదువును చిన్నప్పుడే మానేసింది. అలాంటి పరిస్థితి తన కుమారులకు రావద్దని, మగవాళ్లు సైతం ఇబ్బంది పడే పనిని మహిళగా తాను చేస్తూ కుమారులను పెంచుతోంది. సాధారణంగా ఒక చేనేత మగ్గం దగ్గర నేత నేసే వారితో పాటు ఇద్దరు సహాయకులు ఉంటేనే నెలలో రెండు చీరలను నేయడం జరుగుతుంది.

అలాంటి కష్టమైన పనిని సైతం ఎలాంటి సహాయకులు లేకుండా ఆమె ఒక్కతే ఎంతటి కష్టమైనా రాత్రీ, పగలనే తేడా లేకుండా మగవారికి సమానంగా చేనేత పనిని చేస్తూ నెలకు రెండు చీరలను తయారు చేస్తుంది. వచ్చిన డబ్బులతో ఇంటిని నడుపుకుంటూ.. మున్సిపాలిటి కేంద్రంలోని బ్యాంక్‌లో తెలిసిన వారు, బ్యాంకు సలహాలతో విద్యాలోన్ తీసుకుని పెద్ద కొడుకు నవీన్ కుమార్‌ను హైదరాబాద్‌లో బీటెక్ చదివిస్తుంది. చిన్న కొడుకు లోకేష్‌ను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో చదివిస్తుంది. 

కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు

చేనేత రంగంలో ఇప్పటి వరకు కంచి, ధర్మవరం, సిరిసిల్ల, చేనేత అంచు చీరలకు పేరు ప్రఖ్యాతలు ఉండేవి. అదే కోవలో వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన పోతు రాధ తన ప్రతిభకు పదునుపెట్టింది. మీనా టర్కింగ్ బార్డర్‌తో చేనేత చీరను తయారు చేసి (వీవింగ్ రంగంలో) రాష్ట్ర స్థాయిలో జౌళి శాఖ ఉన్నతాధికారుల దృష్టిలో నిలిచింది. దీంతో కొండా లక్ష్మణ్ బాపూజీ అవా ర్డుకు వనపర్తి జిల్లా నుండి ఇద్దరు చేనేత కార్మికులు ఎంపికయ్యారు. అందులో పోతు రాధ కూడా ఉంది.

 -పీ రాము, వనపర్తి

7842984684