calender_icon.png 29 October, 2024 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాదికే తీగల వంతెనపై గుంతలు

30-07-2024 12:19:38 AM

  1. వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు 
  2. ఒకవైపు మూసివేసిన అధికారులు 
  3. రాజీవ్ రహదారిపైనా గుంతలే.. 
  4. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

కరీంనగర్, జూలై 29 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో గత రెండు వారాల నుంచి కురిసిన వర్షాలకు ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. కరీంనగర్ మానేరు వంతెనపై రూ.194 కోట్లతో నిర్మించిన తీగల వంతెనను గతేడాది జూన్ 26న  ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన రోడ్డుపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తీగల వంతెనపై రాకపోకలు పెరగ డంతోపాటు ఆరంభంలో పిక్నిక్ స్పాట్‌గా మారింది. ప్రస్తుతం వంతెన పరిస్థితి అధ్వానంగా మారింది. 500 మీటర్ల ఈ వంతెన పైనుంచి రెండు లేన్ల రోడ్డును నిర్మించారు.

ఇటీవల కురిసిన వర్షాలకు ఒకవైపు ఉన్న రోడ్డుపై గుంతలు ఏర్పడి వర్షపునీరు నిలవడంతో ఆ దారిని మూసివేశారు. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం వర్షం లేకపోవడంతో తీగల వంతెనపై ప్రస్తుతం ఉన్న తారును తొలగించారు. ఏడాదికే పరిస్థితి ఇలా మారడంతో.. మానేరుపై నిర్మించిన తీగల వంతెన తెలంగాణకే మణిహారం అని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ఈ వంతెనను టాటా కన్సల్టెన్సీ నిర్మించగా అప్రోచ్ రోడ్డు పనులను స్థానిక కాంట్రాక్టర్లు చేపట్టారు. రోడ్డు దెబ్బతినడమే కాకుండా డైనమిక్ లైట్లు పనిచేయకపోవడంతో ఈ వంతెన ఉత్సవ విగ్రహంగా మారే ప్రమాదం ఏర్పడింది. 

గుంతలమయం రాజీవ్ రహదారి

కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు ఉన్న రాజీవ్ రహదారి గుంతలమయమయింది. రెండు వారాలుగా కురిసిన తేలికపాటి వర్షాలకు అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు నరకయాతన పడుతున్నారు. కరీంనగర్ రోడ్డుపై గుంత లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రహదారిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన ఈ రహదారిపై రామగుండం నుంచి హైదరాబాద్ వరకు 300 మలుపులు ఉంటాయి. వీటితోపాటు తాజాగా ఏర్పడ్డ గుంతలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా రామగుం డం వరకు 205 కిలోమీటర్లు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా విస్తరించాలన్న ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 

తీగల బ్రిడ్జి అంశంపై మంత్రి పొన్నంతో చర్చిస్తా

సొంతలాభం కోసం కరీంనగర్ తీగల బ్రిడ్జి నిర్మాణం పేరిట బీఆర్‌ఎస్ నాయకులు కోట్లాది రూపాయలు స్వాహా చేశారు. ఏడాది తిరగకముందే తీగల బ్రిడ్జి అధ్వాన్నంగా మారడం వారి పనితీరుకు నిదర్శనం. ఈ వంతెన గురించి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చిస్తా. వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్తా.

వెలిచాల రాజేందర్‌రావు,

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్

పార్లమెంట్ ఇన్‌చార్జి

తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి

రాజీవ్ రహదారిపై ఏర్పడ్డ గుంతలతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ నుంచి రేణికుంట టోల్‌గేట్ మధ్యలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిపై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతు న్నారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలి.

దుర్శేటి లక్ష్మణ్, ఇందిరానగర్, తిమ్మాపూర్