calender_icon.png 1 April, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాపైనే అధికారులకు ఫిర్యాదు చేస్తావా?

29-03-2025 02:15:37 AM

యువకుడిపై పోస్ట్ ఉమెన్ కుటుంబ సభ్యుల దాడి

యాదవ కుల సమావేశంలో ఘటన

జనగామ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు

జనగామ, మార్చి 28(విజయక్రాంతి): ఓ ఉద్యోగి పనితీరుపై కొందరు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. అది మనసులో పెట్టుకున్న సదరు ఉద్యోగి కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై దాడికి తెగబడ్డారు. కుల సమావేశంలో సదరు యువ కుడు ఎదురుపడడంతో ఒక్కసారిగా తమపై ఫిర్యాదుచేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధితుడు, కులస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకిర్యాల గ్రామంలోని తపాలా కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్ని రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు నవీన్ కుమార్‌తో పాటు పలువురు యువకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తపాలా కార్యాలయంలో పోస్ట్ ఉమెన్‌గా పనిచేస్తున్న ఈర్ల అనూష సమయానికి పింఛన్ డబ్బులు ఇవ్వకుండా సొంతానికి వాడుకుంటున్నారని, మరోవైపు ఉపాధి హామీ డబ్బుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన తపాలా శాఖ ఢిల్లీ నుంచి అధికారుల బృందాన్ని ఈ నెల 13న వెంకిర్యాలకు పంపించింది. ఆ బృందం పోస్టాఫీస్‌లో విచారణ జరిపి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఈర్ల అనూష కుటుంబం తమపై కోపంగా ఉందని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు పోస్ట్ ఉమెన్ భర్త తమను బెదిరించారని చెప్పారు. 

కుల సమావేశంలో దాడి..

తాజాగా శుక్రవారం ఓ విషయమై యాదవ కులస్తులు సమావేశమయ్యారు. ఇదే సమావేశానికి గడ్డం శ్రీనివాస్ అనే యువకుడు హాజరయ్యారు. ఈయనే తపా లా శాఖలో జరిగిన విచారణపై మీడియాకు సమాచారమిచ్చారు. అది మనసులో పెట్టుకున్న ఈర్ల అనూష భర్త లక్ష్మీనారాయణ కుల సమావేశంలో ఒక్కసారిగా శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డాడు. లక్ష్మీనారాయణతో పాటు అతని బాబాయ్‌లు, సోదరుడు కలిసి దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. పెంకు తీసుకుని తలపై కొట్టేందుకు యత్నిస్తుండగా కులస్తులంతా అప్రమత్తమై అడ్డుకున్నారు. ఈ ఘటనపై జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాయాలపాలైన శ్రీనివాస్ జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దాడికి పాల్పడిన లక్ష్మీనారాయణపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, అధికార పార్టీ అండదండలతో ఆయన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపించారు.