‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- ఆర్టీసీలో 1,000 నూతన బస్సులు
- ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీతో కాలుష్యానికి చెక్
- పబ్లిక్ డొమైన్‌లో కులగణన సర్వే చూడొచ్చు
‘త్వరలో ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేస్తాం. మరో వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తాం. వాహనాల కండీషన్ తెలుసుకునేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌లు (ఏటీఎస్) ప్రారంభిస్తున్నాం. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని 116.13 కోట్ల మంది మహిళలు ఉపయోగించుకున్నారు. తద్వారా రూ.3,913.81 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారు.
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లింది. కాలంచెల్లిన వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చాం. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులనే నడిపిస్తాం. ఈవీ, స్క్రాప్ పాలసీతో కాలుష్యానికి చెక్ పెట్టవచ్చు.
మన హైదరాబాద్ మరో ఢిల్లీలా మారకుండా ఉండడానికి అందరం కలిసి పనిచేద్దాం’ అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలు జరుగుతున్న వేళ ‘విజయక్రాంతి’ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలకరించింది.
‘ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీ చేపట్టబోతున్నాం. వీలైనంత త్వరగా భర్తీ చేస్తాం.
మహాలక్ష్మి పథకంతో పెరిగిన బస్సుల్లో రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ఏడాదిలో 1,389 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్ మార్గంలో 10 రాజధాని ఏసీ బస్సులు, హైదరాబాద్ నుంచి పలు జిల్లా కేంద్రాలకు 75 డీలక్స్ బస్సులను తీసుకువచ్చాం. హైదరాబాద్‌లో 125 మెట్రో డీలక్స్ బస్సులు ప్రారంభించాం. హైదరాబాద్,
కరీంనగర్, నిజామాబాద్‌లలో 251 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాం. ’ అని రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన ప్రత్యేకంగా ‘విజయక్రాంతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఆయన మాటల్లోనే..
హైదరాబాద్, విజయక్రాంతి :
- ఈవీ పాలసీకి ఆదరణ వస్తుందా?
హైదరాబాద్‌లో 353, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేటలో 446 ఎలక్ట్రిక్ బస్సులను 2025 మార్చి నాటికి అందుబాటులోకి తెస్తాం. సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులనే నడిపిస్తాం. ప్రజలు ఈవీ పాలసీని ఆదరిస్తారని మేం భావిస్తున్నాం. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏటా సగటున 5 లక్షల వాహనాలు వచ్చి చేరుతున్నాయి.
ఒక రోజులో వాహనాల కారణంగా ఏటా 6-8శాతం అదనపు కార్బన్ ఫుట్ ప్రింట్‌కు దారి తీస్తోంది. ఇంధన వినియోగం ఏడాదికి 8-10 శాతం పెరుగుతున్నది. శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకువచ్చింది.
డిసెంబర్ 31, 2026 వరకు తెలంగాణలో కొనుగోలు చేసే వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయించాం. ఈ ఏడాది కాలంలో తెలంగాణలో 78,262 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి, గత ఏడాది ఇదే కాలానికి విక్రయించిన 51,394 వాహనాలతో పోలిస్తే భారీ వృద్ధిని గమనించవచ్చు.
మహాలక్ష్మిపథకం ఎలా ఉంది?
మహాలక్ష్మి- పథకం ద్వారా డిసెంబర్ 4 వరకు 116.13 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుని రూ.3,913.81 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారు. -ఈ స్కీంను విజయవంతంగా అమలు చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ స్కీం ప్రారంభించకముందు 45 లక్షల మంది ప్రయాణిస్తే, ఇప్పుడు ప్రతిరోజు సగటున 58 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
ఉచిత బస్సు కారణంగా ప్రతి రోజు సగటున దాదాపు 12 లక్షల మంది ప్రయాణికులు పెరిగారు. గతంతో పోల్చితే 27 శాతం మంది అదనం. అంతకుముందు 40 శాతం మంది మహిళలు ప్రయాణిస్తే.. ఇప్పుడా సంఖ్య 65 శాతానికి పెరిగింది. జీరో టికెట్ల నగదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేస్తుండటంతో ఆర్టీసీ లాభాల బాటల్లోకి వెళ్లింది.
రహదారి భద్రతపై తీసుకున్న చర్యలేంటి?
రవాణా శాఖ కొత్త లోగోను ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 213 కొత్త వాహనాలను తెస్తున్నాం. రోడ్డు భద్రతకు ఇటీవల నియమితులైన 112 మంది ఏఎంవీఐల సేవలను వినియోగించుకుంటాం. చిన్న వయసులోనే పిల్లలకు ట్రాఫిక్, రోడ్డు భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
వీటి ఏర్పాటుకు 52 పాఠశాలలు ముందుకు వచ్చాయి. ట్రాఫిక్‌పై నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపట్ల కఠినంగా ఉంటున్నాం. డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ మొదలైన కేసుల్లో డిసెంబర్ -2023 నుంచి ఏడాది కాలంలో 15,209 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేశాం. భవిష్యత్తులోనూ రహదారి భద్రతపై కఠినంగా ఉంటాం.
ప్రతిపక్షాలు సహకరిస్తున్నాయా?
ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది అవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలు ప్రారంభించాం. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేశాం. వివిధ నోటిఫికేషన్ల ద్వారా 54,143 ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాయి.
పదేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ అన్నీ చేసి ఉంటే ప్రజలు ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చే వాళ్లు కాదు కదా. ఇక బీజేపీ నాయకులు కేంద్రం నుంచి నిధులు తీసుకురాకపోయినా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు మాత్రం ముందు వరుసలో ఉంటున్నారు..
కాలుష్య నివారణకు చర్యలేంటి?
ఢిల్లీలోని కాలుష్య పరిస్థితులు హైదరాబాద్ నగరానికి కూడా రావద్దనేదే మా ఉద్దేశం. నిర్లక్ష్యం చేస్తే ఆ పరిస్థితి కచ్చితంగా మనకూ వస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో ఈవీ, స్క్రాప్ పాలసీలు తీసుకువచ్చాం. నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు కచ్చితంగా వీటిని అమలు చేస్తాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలను నగరం నుంచి తరలిస్తాం. ఆర్టీసీలో ఈవీ బస్సులే ఉంటాయి.
నగరంలో కేవలం ఈవీ బస్సులు మాత్రమే నడుపుతాం. దాదాపు 3 వేల ఈవీ బస్సులను రెండేళ్లలో ప్రవేశపెడతాం. పెట్రోలు, డీజిల్ ఆటోలను సైతం ఔటర్ బయటకు పంపిస్తాం. ఈవీ ఆటోలను ప్రవేశపెట్టేందుకు తీసుకోవాల్సిన విధివిధానాలపై రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది.
స్క్రాప్ పాలసీ వల్ల లాభాలేంటి?
కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు పాలసీని తీసుకువచ్చాం. ఇందులో రిజిస్టర్డ్ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ (ఆర్వీఎస్‌ఎఫ్) మరియు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అమలు ఉంటుంది. కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగిస్తాం.
మరోవైపు రహదారి భద్రతను మెరుగుపర్చేందుకు రూ. 296 కోట్ల బడ్జెట్‌తో రాష్ర్టవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌లు (ఏటీఎస్) ప్రారంభిస్తున్నాం. వీటి ద్వారా వాహనాల కండీషన్‌ను తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫిట్‌నెస్ లేని వాహనాలకు పర్మిట్లు నిరాకరించి ప్రమాదాలను అరికట్టేందుకు ఈ ఏటీఎస్‌లు దోహదం చేస్తాయి.
పబ్లిక్ డొమైన్‌లో కులగణన సర్వే?
గత ప్రభుత్వం సమగ్ర కులగణన చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేమంతా సహకరించాం. కానీ సర్వే పూర్తి చేసినా ఆ వివరాలు మాత్రం బయటకు వెళ్లడించనే లేదు. కానీ మేము అలా కాదు. మేం ప్రస్తుతం చేపడుతున్న సర్వే వివరాలను అందరికీ తెలిసేలా పబ్లిక్ డొమైన్‌లో పెడతాం. కానీ బీఆర్‌ఎస్, బీజేపీ ఈ సర్వేకు ఏమాత్రం సహకరించడం లేదు. సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తన కార్యాచరణను చేపడుతుంది.