calender_icon.png 18 October, 2024 | 2:22 PM

పార్టీకి పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలి..

18-10-2024 01:16:42 PM

సిద్దిపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి పది నెలలు గడుస్తున్న సిద్దిపేట నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడం పార్టీ నాయకులలో ఐక్యత లేకపోవడమే కారణమని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నైన్ నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నాయకులను పార్టీ సీనియర్ నాయకులను అధిష్టానం గుర్తిస్తుందని విశ్వాసం ఉందన్నారు. నిన్న మొన్న పార్టీలో చేరి పదవులు ఆశించడం సరి కాదన్నారు, అధిష్టానం స్థానికంగా ఉన్న పార్టీ సీనియర్ నాయకులను సంప్రదింపులు జరిపి ఎవరికి ఎలాంటి నామినేటెడ్ పదవి ఇవ్వడం మంచిదనేది గుర్తించాలని కోరారు. పార్టీ సీనియర్ నాయకులను కాదని ఇటీవల పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తే పార్టీ పరువు పోతుందని సూచించారు.

సిద్దిపేటలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలతో పాటు అన్ని సంక్షేమ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చకు రావాలని సవాల్ విసిరితే బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించలేకపోవడమే నిదర్శనం అన్నారు. సిద్దిపేట పట్టణంలో ప్రతి వార్డులో పార్టీ నిర్మాణం కోసం కృషి చేసిన మహిళా నాయకురాలను కాదని ఇటీవల వచ్చిన వారికి పదవులు ఇస్తే ఊరుకోమంటూ పట్టణ మాజీ అధ్యక్షురాలు ఎల్లవ్వ అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి పదవులు పొందడం సిగ్గుచేటన్నారు. పార్టీ కోసం పని చేసిన నాయకులు కార్యకర్తలకు అధిష్టానం గుర్తింపు ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దు రాజు, యాదవ్, వట్టిపల్లి రాజిరెడ్డి, సన సురేందర్ రెడ్డి, జిల్లా మాజీ సహాయ కార్యదర్శి రజిని, మార్క చందు తదితరులు పాల్గొన్నారు.