calender_icon.png 25 February, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవికి మోక్షం ఎప్పుడో?

25-02-2025 12:54:29 AM

ఏడుపాయల పాలకమండలి లేకుండానే జాతర నిర్వహణ

నోటిఫికేషన్ వచ్చినా  భర్తీకాని పోస్టులు

జాతర తర్వాతే భర్తీకి సన్నాహాలు

 మైనంపల్లి ఆశీస్సులు ఎవరికి దక్కెనో ?

మెదక్, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని దేవాలయాల పాలక వర్గాల ఏర్పాటుకు గత నవంబర్లోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం పాలకమండలి చైర్మన్, డైరెక్టర్ల పదవులు భర్తీ చేస్తారని అనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి ప్రక్రియ పూర్తికాకపోవడంతో నోటిఫికేషన్ రద్దయింది. దీంతో ఏడుపాయల శివరాత్రి జాతర కొత్త పాలకమండలి ఆధ్వర్యంలో జరుగుతుందని భావించిన వారికి నిరాశా ఎదురైంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే పదేళ్ళ పాటు పదవులను పొందారు. ఈసారి మెదక్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక పార్టీ నాయకుల్లో ఆశలు చిగురించాయి. కానీ గత నవంబర్లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యే రోహిత్రావు ఎవరి పేర్లను ఎంపిక చేయకపోవ డంతో ఎంపిక వాయిదా పడింది. దీంతో మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 26న శివరాత్రి జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే మాఘ మాసంలో జరిగే కార్యక్రమాలు అధికారుల నేతృత్వంలోనే నిర్వహిం చారు. జాతర వరకు కొత్త పాలకవర్గం ఏర్పా టు చేస్తారని అనుకున్నా అది అమలు కాలేదు. 

జాతర తర్వాతే భర్తీ..?

ఏడుపాయల దేవస్థానం చైర్మన్, డైరెక్టర్ల నియామకం జాతరలోపు జరిగే అవకాశం లేదని స్పష్టమవుతోంది. జాతర నిర్వహణ తర్వాతే మళ్ళీ నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడుపాయల వన దుర్గామాత ఆలయ పాలకవర్గంలో మొత్తం 14 డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఆలయ పూజారి ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా, మరొక దాతకు అవకాశం ఉంటుంది. మిగిలిన 12 పోస్టుల్లో 10 మంది డైరెక్టర్లు పాపన్నపేట మండలం, రెండు పోస్టులు కొల్చారం మండలానికి చెందిన వారికి కేటాయిస్తారు. డైరెక్టర్ల ఎన్నిక పూర్తయ్యాక వారిలో నుంచి ఒకరిని చైర్మన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. 

భారీగానే ఆశావహులు...

ఏడుపాయల పాలకమండలి పదవీకాలం గత ఆగస్టు 6వ తేదీతో ముగిసింది. దీంతో కొత్త పాలక మండలి ఏర్పాటు చేయాల్సి ఉండడంతో నోటిఫికేషన్ జారీ చేసినా పోస్టులు భర్తీ కాకపోవడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. చైర్మన్ పదవి కోసం పాపన్నపేట మండలానికి చెందిన వారినే కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఇదే మండలానికి కేటాయించనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే మండలం పొడ్చన్పల్లి తండాకు చెందిన గోవింద్ నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే శెట్టి శ్రీకాంతప్ప, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, మాజీ చైర్మన్ నర్సింలు, శ్రీకాంత్రెడ్డి, జంగం సతీష్ పంతులు భూమన్నతో పాటు మరో ఇద్దరు పోటీ పడుతున్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశీస్సులు ఎవరిపై ఉంటాయో వారికే చైర్మన్ పదవి లభించనుంది. ఇందుకోసం ఎవరికి వారే ప్రయత్నాలు సాగిస్తున్నారు.