calender_icon.png 6 November, 2024 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఎస్‌ఆర్టీసీలో 3035 పోస్టులు

03-07-2024 01:28:55 AM

భర్తీకి ప్రభుత్వం అనుమతి 

మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా 

బలోపేతం చేస్తామని వెల్లడి

హైదరాబాద్, జూలై ౨ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు దశాబ్ద కాలం తర్వాత ఆర్టీసీలో నియామకాల కోసం నోటిఫికేషన్ వెలువడుతుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా ప్రభుత్వం అపాయింట్‌మెంట్ ప్రకటించాలని ఆర్టీసీ యూనియన్ నాయకులు కోరుతున్నారు. 

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో 3,035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవా ణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్‌కు, డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ర్టం ఏర్పడినప్పటి నుంచి ఇప్ప టివరకు టీజీఎస్‌ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు.

కొత్త రక్తం తో రాష్ర్టంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగు ణంగా నియామకా లు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3,035 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

సీఎంకు ఆర్టీసీ ధన్యవాదాలు

ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తిస్తూ సంస్థలో 3,035 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన రాష్ర్ట ప్రభుత్వానికి తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం  కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగాల భర్తీకి సం బంధించిన ప్రతిపాదనలు పంపిన వెంటనే అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితోపాటు చొరవ తీసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.

సంస్థలో 2012 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జరగలేదని.. దాదాపు 12 సంవత్స రాల తర్వాత నియామక ప్రక్రియ జరుగబోతుందని తెలిపింది. ప్రభుత్వం తాజాగా 3,035 పోస్టులకు అనుమతి ఇవ్వడం సంస్థ బలోపేతానికి ఎంతో దోహదం చేస్తుందని వివరించింది. ప్రజలకు వేగవంతమైన సేవలను అందించడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మరింత సమర్థవంతగా అమలయ్యేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాలతో ఈ పోస్టుల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.