calender_icon.png 17 March, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ కౌన్సెలింగ్ వాయిదా

07-07-2024 12:34:37 AM

సుప్రీం నిరాకరించినా ఎన్టీయే ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 6: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఎన్టీయే వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ శని వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాయిదా వేస్తున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే వెల్లడిస్తుందని తెలిపింది. నీట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టీయే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

నీట్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో పరీక్షపై దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీంకోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌన్సెలింగ్ వాయిదాను తోసిపుచ్చింది. అయితే, గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు పునఃపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. పరీక్షల రద్దుకు కేంద్రంతో పాటు సుప్రీంకోర్టు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. పరీక్షను రద్దు చేస్తే నిజాయతీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు అలాంటి చర్యలు చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది.