calender_icon.png 21 January, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నల్లగొండ మహాధర్నా వాయిదా

21-01-2025 01:55:44 AM

* నిరసనకు అనుమతి ఇవ్వని పోలీసులు

* హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ నేత 

* విచారణను 27కు వాయిదా వేసిన న్యాయస్థానం

* తీర్పు అనంతరం ధర్నా తేదీని ప్రకటిస్తామన్న గులాబీ శ్రేణులు

హైదరాబాద్/ నల్లగొండ జనవరి 20 (విజయక్రాంతి): రైతుభరోసా పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందించాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ మంగళవారం (ఈ నెల 21న) మహా ధర్నా పేరిట నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయిచింది. దీనిలో భాగంగా నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించే ప్రదర్శన నిర్వహించాలని ఏర్పాట్లు చేసింది.

కానీ.. ధర్నాకు నల్గొండ డీఎస్పీ నుంచి అనుమతులు రాకపోవడంతో బీఆర్‌ఎస్ నల్లగొండ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ హైకోర్టును ఆశ్రయించి సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే వీడ్కోలు సభ ఉన్నందున, పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ చేపట్టలేమని స్పష్టం చేశారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపస్తూ.. ‘రైతుభరోసా పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో ఎకరానికి రూ.12 వేలు మాత్రమే ఇస్తానని చెప్తున్నది.

ఈ అంశాన్ని ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతున్నది. ప్రదర్శనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనాల్సి ఉన్నది. ఇప్పటికే కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని నిరోధింధించాలని చూడడం రాజ్యాంగ విరుద్ధం’ అని తెలిపారు.

దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది ‘ఈనెల 24 నుంచి నల్లగొండలో గ్రామసభలు జరుగనున్నాయి. అలాగే 26న అధికారులు, పోలీసులు రిపబ్లిక్ వేడుకలు నిర్వహించాల్సి ఉన్నది’ అని వాదిస్తుండగా, న్యాయమూర్తి కలుగజేసుకుని, ఈ పిటిషన్‌పై ఈనెల 27న పూర్తిస్థాయి లో విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

ఈలోపు అనుమతుల నిరాకరణపై పోలీసులు తమ వివరణ తెలియజేయాలని ప్రభుత్వం తర ఫు న్యాయవాదిని ఆదేశించారు. న్యాయస్థానం తీర్పు అనంతరం తదుపరి ధర్నా నిర్వహించే తేదీని వెల్లడిస్తామని మరోవైపు బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకే బీఆర్‌ఎస్ మహా ధర్నాను అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పోరాటం చేయడం ఒక రాజకీయ పార్టీ హక్కు అని గుర్తుచేస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభు త్వ పెద్దల ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు అనుమతులు నిలిపివేశారని ఆరోపించారు.