calender_icon.png 28 December, 2024 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

31 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు

28-12-2024 03:08:21 AM

ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు హైకోర్టులో ఉరట లభించింది ఫార్ములా- ఈ-కార్ రేస్ కేసు లో కేటీఆర్‌ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

గత విచారణ సందర్భంగా 30 వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇవ్వగా, శుక్రవారం ఆ మధ్యంతర ఉత్తర్వులను 31వ తేదీ వరకు పొడిగించింది. అరెస్టు వద్దంటూ జారీచేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏసీబీ చేసిన విజ్ఞప్తిని న్యా యమూర్తి తోసిపుచ్చారు. వాదనలు వినకుండా ఉత్తర్వులను మార్చలేమని పేర్కొ న్నారు.

కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణ హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఈ నెల 19న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీకే నాటి చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పేరు చేర్చారు.

ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో ఈ నెల 20న లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అలాగే అరెస్టు వద్దంటూ ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేసి కేటీఆర్‌ను విచారించేలా ఉత్తర్వులు ఇవ్వాలని అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి నిరాకరించిన న్యాయమూర్తి.. విచారణను 31కి వాయిదా వేశారు. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఏకపక్షంగా కేటీఆర్ చెల్లింపులు

ఫార్ముల ఈ రేస్ ఒప్పందాల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఏకపక్షంగా చెల్లింపులు చేశారని, ఆయన అధీనంలోని మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని ఏసీబీ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ పిటిషన్‌లో పేర్కొంది. కేటీఆర్ నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపించింది.

క్యాబినెట్ సమ్మతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారని తెలిపింది. ఇలా ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమంది. విదేశీ సంస్థకు అనుమతులు లేకుండానే రూ.54 కోట్లు బదిలీ చేశారని చెప్పింది. 

ఇలా చేయడం ద్వారా హెచ్‌ఎండీఏపై రూ.8 కోట్లకుపైగా ఇన్‌కం ట్యాక్స్ భారం పడిందని వివరించింది.  ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ  ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. రికార్డుల్లోని సమాచారానికి విరుద్ధంగా కేటీఆర్ చెబుతున్నారని అన్నారు. రికార్డుల ప్రకారం ప్రాథమికంగా నేరానికి పాల్పడినట్లు రుజువు అవుతోందన్నారు.

నిబంధనలు, బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా కేటీఆర్ చర్యలు ఉన్నాయన్నారు. రాజకీయ కక్షతో, ఒత్తిళ్లతో ఫిర్యాదు చేశారంటూ కేటీఆర్ చేసే వాదన చట్ట వ్యతిరేకమన్నారు. రాజకీయంగా ప్రతిష్ఠ దెబ్బతీయడానికే సీఆర్పీసీ సెక్షన్ 41ఎ కింద నోటీసు జారీకి అవకాశం లేకుండా చేశామనడం సరికాదన్నారు. ఎస్‌ఈఓకు చెల్లింపులు జరపాలని తానే చెప్పినట్లు కేటీఆర్ స్వ యంగా వెల్లడించారన్నారు.

ఎఫ్‌ఎఆర్ నమోదులో జాప్యం జరిగిందని, ఈ కారణంగా కేసును కొట్టేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. అభియోగాలను నిర్ధారణ చేసుకున్నామని, విచారణ జరిపి.. వివ రాల సేకరించామని అందుకు సమయం పట్టిందని వివరించారు. ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం అవుతుందన్నారు.

కాగ్నిజెన్స్ తీసుకోగల కార ణాలు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నప్పుడు కోర్టులు కేసు ప్రాథమిక విచారణ దశలో అడ్డుకోడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. కేటీఆర్ కేసును విచారణ చేపట్టేందుకు వీలుగా ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. 

24 గంటల్లోనే..

ఎఫ్‌ఐఆర్ దాఖలైన 24 గంటల్లోనే అసంబద్ధమైన కారణాలతో కేసును కొట్టేయాలని హైకోర్టుకు వచ్చారని తప్పుపట్టారు. చట్టప్రకారంగానీ, వాస్తవాదారాలను పరిశీలిస్తే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదన్నారు. 2022 అక్టోబరు 25న ఫార్ము లా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఓ) మున్సిపల్ శాఖ ఏస్ నెక్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య 9, 10, 11, 12 సీజన్ రేస్లను హైదరాబాద్ నిర్వహించాలనే ఒప్పందం కుదిరిందని వివరించారు.

10వ సీజన్‌లలో ప్రమోటర్ వైదొలగడంతో ఫార్ములా ఈ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించిందన్నారు. ఇందుకు హెచ్‌ఎండీఏను ప్రమో టర్‌గా ప్రభుత్వం అనుమతులు మం జూరు చేసిందన్నారు. 2023 బకాయిల కింద హెచ్‌ఎం డీఎ జనరల్ ఫండ్స్ నుంచి రూ.54.89 కోట్లు విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయన్నారు. సాధారణంగా రూ.10 కోట్లకు మించి చెల్లింపు లు జరిగితే క్యాబినెట్ ఆమోదం విధిగా ఉండాలన్నారు.

ఇవేమీలేకుండా చెల్లింపులు జరిగాయన్నారు. విదేశీ సంస్థలకు చెల్లింపుల్లోనూ అనుమతులు పొందలేదన్నారు. కేటీఆర్ ఆదేశాలు, అనుమతి తోనే చెల్లింపులు ఏకపక్షంగా జరిగాయని చెప్పారు. తొలి ఒప్పందం రద్దుకా గా రెండో సారి 2023 అక్టోబర్ 30న ఎఫ్‌ఓ, మున్సిపల్ శాఖల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ అగ్రిమెంట్ జరిగేప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు.

మూడేళ్లకుగాను ఫార్ముల ఈచూ నిమి త్తం రూ.600 కోట్లు వెచ్చించాల్సి ఉందని వివరించారు. ఈసీ అనుమతి లేకుండా అగ్రిమెంట్ చేసుకునేలా కేటీఆర్ చొరవ తీసుకున్నారని వివరించారు. తొలి ఒప్పందం 2022 అక్టోబర్ 15న జరగ్గా 2023 అక్టోబర్ 27న రద్దయిందని తెలిపారు. తర్వాత 2023 అక్టోబర్ 30న ఒప్పందం కుదిరిందని, అయితే అంతకు ముందే అంటే, అక్టోబర్ 3, 11న హెచ్‌ఎండీఏ రూ.54.88 కోట్లు చెల్లింపులు చేసిందన్నారు.

ఒప్పందానికి ముం దే చెల్లింపులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు.  రూ.10 కోట్లకు మించి చెల్లింపులు జరిగితే ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీఏ పర్మిషన్ తీసుకోవాలన్న నిబంధన అమలు కాలేదన్నారు. ప్రభుత్వం కూడా ఆర్థికశాఖ అనుమతి పొందలేదన్నారు. 30న రెండో ఒప్పం దం కుదుర్చుకుని, 2022 నాటి ఒప్పం దం మేరకు అంటే రద్దయిన ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు జరిగాయని, అదీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జరిగిందన్నారు.

తొలి ఒప్పం దం మేరకు ఫార్ములా ఈ ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ పాత్రని, స్పాన్సర్ తరఫున చెల్లింపులు చేయాల్సిన అవసరం ఏమిటని, ఇదే అవినీతికి నిదర్శ నమని చెప్పారు. కేటీఆర్ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని, దీనికి చెందిన కుట్ర, నేరపూరిత దుష్ప్రవర్తన ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని అన్నారు.

మున్సిపల్ శాఖ నుంచి లెటర్ వచ్చాక సంబంధిత ఆఫీసర్ల పర్మిషన్లు తీసుకున్నాకే కేటీఆర్‌పై కేసు నమోదు జరిగిందన్నారు. అంతా చట్ట ప్రకారమే జరిగిందన్నారు. ఎలాంటి నేరం చేయలేదంటూ కేటీఆర్ చెబుతున్న కారణాలన్నీ అసత్యాలేనని చెప్పారు. కాబట్టి కేటీఆర్ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.

రాజకీయంగా అప్రతిష్ఠ పాల్జేయడానికే: కేటీఆర్

రాజకీయంగా తనను అప్రతిష్ఠ పాల్జేయడానికే దర్యాప్తు సంస్థలను వినియోగిం చుకుని, తప్పుడు కేసులు పెడుతున్నారని కేటీఆర్ హైకోర్టుకు తెలిపారు.  ఒప్పందాల అమలులో ఏవైనా విధానపరమైన అంశాలను చూడాల్సింది సంబంధిత శాఖాధికా రులేనని, మంత్రిగా అది తన బాధ్యత కాదని మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు.

విదేశీ సంస్థకు నిధుల తరలింపు సమయంలోను అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాంకు చూసుకోవా లని, అంతేగానీ తాను కాదని స్పష్టం చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న తన పిటిషన్‌లో ఏసీబీ కౌంటర్‌కు సమాధానంగా కేటీఆర్ రిప్లై కౌంటర్ దాఖలుచేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా దర్యాప్తును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నానడం సరికాదని తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌లోనే ప్రాథమికంగా నేరారోపణ వెల్లడికాకపోవడంతో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. రాజకీయ కక్షసాధింపు చర్యలతో దర్యాప్తు సంస్థలను వాడుకోవడం చెల్లుబాటుకాదన్నారు. ఆర్థికపరమైన ప్రభావాన్ని ఆలోచిం చకుండా ప్రభుత్వం స్పాన్సర్ పాత్రను భరించారనడం సరికాదన్నారు.

9 నుంచి 12వ సీజన్ వరకు 2023 మే 5లోగా స్పాన్సర్ చెల్లించాల్సిన 10వ సీజన్ ఫీజుపై ఎఫ్‌ఈఓ రాసిన లేఖపై ప్రమోటర్ స్పందించకపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీలను 2023 జూన్ 20 నుంచి నిర్వహిం చడానికి షెడ్యూలు ఖరారు చేయడంతో ఎఫ్‌ఈఓతో ప్రభుత్వం సంప్రదించిందన్నారు.

ప్రభుత్వం జరిపిన చర్చల కారణంగా 10వ సీజన్ పోటీలను నిర్వహించడానికి ఎఫ్‌ఈఓ అంగీకరించిందని, అంతేగాకుండా ఫీజు మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించడానికి అనుమతించిందని తెలిపారు.  మొదటి విడత 25 శాతం 2023 సెప్టెంబర్ 26న, 25 శాతం అక్టోబరు 4లోగా, మిగిలిన 50 శాతం అక్టోబర్ 31లోగా చెల్లించాల్సి ఉందన్నారు.

అప్పటి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, అర్వింద్ కుమార్ హెచ్‌ఎండీఎ కమిషనర్ హోదాలో పురపాలకశాఖ మంత్రి ఆమోదం కోసం ఫైలును ఉంచారన్నారు. 10వ సీజన్ నిర్వహణకు మొత్తం రూ.160 కోట్లు అనుమ తించాలని ఫైలు ఉంచారన్నారు. హెచ్‌ఎండీఎ చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ అని, ప్రమోటర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

విదేశీ నిధులను తరలించడానికి అవసరమైన అనుమతులను బ్యాంకే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన విధానాలను సంబంధిత అధికారులు చూసుకోవాల్సి ఉందన్నారు. మంత్రిగా విధాన పరమైన అంశాలను తాను చూడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు.  పన్నుకు సంబంధించి పాత ఒప్పందంలోనే ఉందని, అందువల్ల అదనంగా భారం అనడం సరికాదన్నారు.

పదో సీజన్ జరగనందున రీఫండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఫెడరేషన్ ఆఫ్ మోటారు స్పోర్ట్స్ క్లబ్ ఫీజు వాపసు తీసుకోవాలంటూ రాసిన లేఖపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. రూ.10 కోట్లకు మించి చెల్లింపులకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలంటూ హెచ్‌ఎండీఎ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. ఒకవేళ ఉన్నా, దాన్ని సంబంధిత శాఖ చూసుకోవాలని.. మంత్రిగా తనకు సంబంధంలేదన్నారు.

ప్రమోటర్ వాటాను ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరంలేదన్న వాదనలో వాస్తవం లేదని, 2023 సెప్టెంబర్ 27న జరిగిన ముసాయిదా ఒప్పందంలోనే హెచ్‌ఏండీఎను ప్రమోటర్‌గా చూపారన్నారు. పదో సీజన్ తప్పిపోకుండా ఉండేందుకు వాయిదాల ప్రకారం చెల్లింపుల నిమిత్తమే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలతో తనకు సంబంధంలేదని, అక్రమాలకు తాను బాధ్యుడు కాదన్నారు. వచ్చే 3 ఏళ్లకు రూ.600 కోట్ల అన్న వాదన సరికాదని, ఎలాంటి అంచనా లేకుండా ఖర్చును పెంచి చూపారన్నారు. సచివాలయం బిజినెస్ నిబంధనలు హెచ్‌ఎండీఎ కు వర్తించవన్నారు.

మిగిలిన 50 శాతం చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.55 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వం రేస్‌ల నిర్వహణ వల్ల వచ్చే ఆదాయం కోల్పోయింద న్నారు. నీల్సన్ నివేదిక ప్రకారం సీజన్ 9లో ప్రభుత్వానికి 83 మిలియన్ డాలర్లు ఆదాయం రాష్ట్రానికి సమకూ రిందని, ప్రస్తుతం 10వ సీజన్ లేకపోవడంతో రాష్ట్రం ఆదాయం కోల్పోయిం దన్నారు. రాజకీయ కక్షసాధింపుతో దాఖలు చేసిన కేసును కొట్టివేయా లని కేటీఆర్ అభ్యర్థించారు.