పరీక్షల వాయిదా దీక్షల వెనుక బీఆర్‌ఎస్
- పేద విద్యార్థులను రెచ్చగొడుతున్న ప్రతిపక్షం
- హరీశ్‌రావు, కేటీఆర్ దీక్షలు ఎందుకు చేయరు?
- వాయిదా వేస్తే లాభపడేది కోచింగ్ మాఫియానే
- పీఎం మోదీ చుట్టూ పిల్లిలా తిరుగుతున్న బీఆర్‌ఎస్ నేతలు
- 90 రోజుల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
- కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు సముచిత స్థానం
- మహబూబ్‌నగర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్
అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసిన బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. వాటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు ప్రధానమంత్రి చుట్టూ పిల్లిలా తిరుగుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీని వారి సొంత అవసరాల కోసమే పెట్టుకొన్నారు.
-సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జూలై 9 (విజయక్రాంతి): ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీని వాయిదా వేయించేందుకు పేద విద్యార్థులతో బీఆర్‌ఎస్ నేతలే పోరాటాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పరీక్ష వాయిదా కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతూ వారి జీవితాలతో ఆడుకొంటున్నా రని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ పేద విద్యార్థులతో నిరా హార దీక్షలు చేయిస్తున్నారని, మరి వారు ఎందుకు దీక్షలు చేయటం లేదని ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించిన సీఎం.. స్థానిక ఏఎస్‌ఎన్ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం 11,500 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలియజేశారు. పరీక్షల వాయిదా వల్ల ప్రభుత్వానికి నష్టం ఉండదనే విషయాన్ని నిరుద్యోగులు గమనించాలని సూచించారు.
నిరుద్యోగులతో బీఆర్‌ఎస్ ఆటలు
పరీక్షలు రద్దు చేస్తే లాభపడేది కోచింగ్ సెంటర్లు మాత్రమేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కోచింగ్ సెంటర్లకు కోట్ల ఆదాయం తెచ్చిపెట్టేందుకే వాయిదాలు కోరుతున్నారని విమర్శించారు. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లకు అప్పటి సర్కారు పరీక్షలు నిర్వహించలేదని, ఇప్పుడు కూడా పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగాలు పొందుతారని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో హరీష్‌రావు పెట్రోల్ తెచ్చుకుని, ఆర్థ రూపాయి పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోకుండా శ్రీకాంతాచారితోపాటు ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోగొట్టారని విమర్శించారు. దళిత, గిరిజన బిడ్డలను దీక్షల్లో కూర్చోబెట్టి.. మీరు మాత్రం పొద్దుగాల తిని, రాత్రిపూట మందు తాగి సంతో షంగా ఉన్నారని బీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు. 2011లో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయని, దీనిని నిరుద్యోగులు గమనించాలని కోరారు.
అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసిన బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. వాటి నుంచి బయటపడేందుకు ప్రధానమంత్రి చుట్టూ పిల్లిలా తిరుగుతున్నారని సీఎం విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీని వారి సొంత అవసరాల కోసమే పెట్టుకొన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మాయమాటలు చెప్పి పదేండ్లు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మేం మీలా దొంగదెబ్బ తీయడం లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. నాడు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తుకు రాలేదు? కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొన్నందుకే కేసీఆర్‌కు పుట్టగతులు లేకుండా పోయాయి.
ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలనుకొంటే ఇవ్వచ్చు. లేదంటే ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకో’ అని కేసీఆర్‌కు సూచించారు. బీఆర్‌ఎస్ బలహీనపడినప్పుడల్లా నిరుద్యోగులను ఉపయోగించుకుంటుందని విమర్శించారు. డీఎస్సీని ఎందుకు వాయిదా వెయ్యాలో నిరుద్యోగులు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. రాష్ట్రంలోని లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తల్లో తానూ ఒకడినని సీఎం అన్నారు. ఇప్పటివరకు నాయకులను గెలిపించేందుకు కష్టపడిన కార్యకర్తలు.. ఇకపై స్థానిక సంస్థల్లో స్వీయ గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
శ్రమించిన కార్యకర్తలకే నామినేటేడ్ పోస్టులు
కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ‘నా పదవి నాయకుల వల్ల రాలేదు. కార్యకర్తల కష్ట వల్ల వచ్చింది. మీ రుణం తీర్చుకునేందుకు ఈ పదవిని ఉపయోగిస్తా’ అని హామీ ఇచ్చారు. గత పదేండ్లు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేసిన కేసీఆర్.. ఇప్పుడు రాజనీతి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికరెడ్డి, మేఘారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, మధుసూద న్‌రెడ్డి, రాష్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు చిన్నారెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరే షన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.