- ప్రత్యర్థులపై విమర్శలకు ఆయుధంగా సోషల్ మీడియా
- ఆప్, బీజేపీ పరస్పర వ్యాఖ్యలతో వేడెక్కుతున్న ఢిల్లీ పాలిటిక్స్
న్యూఢిల్లీ, జనవరి 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తమ ప్రత్యర్థులపై విమర్శలను ఎక్కుపెట్టేందుకు ఆయా పార్టీ లు పోస్టర్లను రూపొందిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ, ఢిల్లీ సీఎం అతిశీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ, కాల్కాజీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిని బాహుబలి సినిమాలోని కాలకేయ పాత్రతో పోలుస్తూ శనివారం ఆప్ ఎక్స్‌లో పోస్టర్ విడుదల చేసింది. ‘గాలిబాజ్ పార్టీ కా గాలిబాజ్ సీఎం’ అంటూ ట్యాగ్‌లైన్ యాడ్ చేసింది. దీంతో బీజేపీ నేతలు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సోషల్‌మీడియాలో విరుచుకుపడ్డారు.
అతడి పేరిట పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో అరవింద్ సీఎంగా ఉన్నప్పుడు నివాసమున్న పీష్‌మహల్ ముందు ఆభరణాలతో, రాజువేషంలో ఉన్న కేజ్రీని చిత్రాన్ని ప్రదర్శించారు. ‘ఢిల్లీకి జనతా నే థానా హై, పీష్‌మహల్ వాలే ఆప్ దా ఆజం కో భగనా హై’ అంటూ ట్యాగ్ చేశారు. పీష్‌మహల్ మరమ్మతుల కోసం కేజ్రీవాల్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్న బీజేపీ అదే విషయాన్ని బలంగా చెప్పేందుకు ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం విధితమే. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి.