09-03-2025 07:43:02 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీకి సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవన్న 9వ వర్ధంతి సందర్భంగా మునగాల మండలం పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో కామ్రేడ్ రవన్నకు జోహార్లు అర్పించి అనంతరం పోస్ట్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ గ్రామ శాఖ కార్యదర్శి ధరావత రవిలు మాట్లాడుతూ... కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ చిన్న వయసులోనే తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలకు ఆకర్షితుడై తాను చనిపోయే వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని అన్నారు.
సమాజంలో దోపిడీ, పీడన, అణిచివేతలకు వ్యతిరేకంగా ప్రజలను పోరాటాల వైపు మళ్లించాడని కొనియాడారు. గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో ఆదివాసీలకు, గిజనులకు, దళిత బహుజనలకు రవన్నగా మరి వారికి ఆత్మస్థైర్యం నేర్పాదని అన్నారు. పీడిత ప్రజల విముక్తి కోసం, దున్నేవానికే భూమి నినాదంతో ఊపందుకున్న నక్సలైట్ ఉద్యమానికి వెన్నెముకలా పని చేశాడని అన్నారు. వేలాది ఎకరాల పోడు భూములను పేదలకు పంచిపెట్టారని, నిలవ నీడ లేని నిరుపేదలకు పోడు కొట్టించి గ్రామాలను నిర్మించాడని అన్నారు. తనను తాను విప్లవీకరించుకుంటూనే ఎంతోమంది విప్లవకారులను స్పూర్తిగా నిలిచాడని అన్నారు. రాజకీయంగా, సిద్దాంతపరంగా ఎన్ని అభిప్రాయాలు ఉన్నా పార్టీ ఐక్యత కోసం అహర్నిశలు కృషి చేశాడని అన్నారు. నేడు కేంద్రంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ కాశాయికరణ చేస్తుందని అన్నారు.
దేశభక్తి ముసుగులో దేశ సంపదను కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు, బడా కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని, ప్రజా హక్కులను కూనీ చేస్తూ కార్పొరేట్ అనుకూల చట్టాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నయవంచనకు గురిచేసిందని దుయ్యబట్టారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్(రవన్న) అందించిన స్పూర్తితో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు యల్లావుల సైదులు, గ్రామ శాఖ నాయకులు వీరబోయిన బాలయ్య, బూరగోముల కోటయ్య, పొన్నం బ్రహ్మం, గడ్డం రామంజి, వటేపు కోటయ్య, బూరగోమ్ముల వెంకన్న, పొన్నం కిట్టయ్య, వీరబోయిన సంపూర్ణ, రమాదేవి, శ్రావణ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.