రాజ్యాంగ రక్షణకు సామాజిక శక్తులు నడుం బిగించాలి..
ఎఐడీ ఆర్ యం 2వ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి..
ముషీరాబాద్,: (విజయక్రాంతి): భారతదేశ ప్రజలందరి గుండెకాయ లాంటి భారత రాజ్యాంగానికి మతోన్మాద శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, ఆ రాజ్యాంగమే దేశ సమఖ్యత సమగ్రతలను నిలబెడుతుందని ఆ రాజ్యాంగ రక్షణకు సామాజిక శక్తులు నడుం బిగించాలని సీపీఐ జాతీయ కార్య వర్గసభ్యులు చాడ వెంకటరెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యం. బాల నరసింహలు అన్నారు. అఖిలభారత దళిత హక్కుల ఉద్యమం (ఎఐడీఆర్ యం) 2వ జాతీయ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హిమాయత్ నగర్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ మత రాజ్యాలన్నీ చీకటి రాజ్యాలు అయితే భారత రాజ్యాంగం సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద సోషలిస్టు భావాలను సంతరించుకుందని చెప్పారు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్న ఆర్ఎస్ఎస్ బిజెపి అట్టడుగు వర్గాల హక్కులను కాలరాస్తుందన్నారు. దేశ సమైక్యత సమగ్రతల కోసం లౌకిక విలువల కోసం నేటి యువతరం కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం మౌలిక పునాదులుగా ఉన్న ప్రజాస్వామ్యం ఫెడరలిజం సామాజిక న్యాయం లౌకికత్వం నాలుగు మూల స్తంభాలను కాపాడుకోవాలని అన్నారు.
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని తద్వారా సామాజిక న్యాయానికి బాట వేయాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 110 దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విభిన్న వైవిధ్యాలు కలిగిన దేశంలో దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైన నిలబెట్టడానికి, కులం మతం భాషా ప్రాంతం అతీతంగా ప్రజలందరికీ సమాన హక్కులు ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారని ఆయన చెప్పారు. ప్రాచీన మనువాద సంస్కృతి సైదాంతిక భావన కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ కనుసనల్లోని బిజెపి ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి అంబేద్కర్ ఆలోచనలను తుద ముట్టించటానికి కుట్రలు కుతంత్రాలు చేస్తుందని సామాజిక శక్తులు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో డి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె యేసురత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జే కుమార్, రాష్ట్ర కోశాధికారి ఏ. రాజ్ కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు సిచ్ శ్రీనివాస్,సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉమాహేష్,వెంకస్వామి తదితరులు పాల్గొన్నారు.