26-02-2025 02:02:00 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 25 : (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సీ హాల్ లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.
ఈ మేరకు కలెక్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపారు. ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పక్కాగా వ్యవహరించాలని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం 255 మంది దరఖాస్తు చేసుకోగా, ఉదయం 11 గంటల సమయానికి ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి పారదర్శకంగా, గోప్యతను పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కాగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగింది.