calender_icon.png 1 March, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగంటిన సాగర్ జలాలు

01-03-2025 12:39:06 AM

529 అడుగులకు తగ్గిన నీటిమట్టం

వేసవికి ముందే పడిపోయిన నిల్వ

తాగునీటి అవసరాలకే సరిపోయే అవకాశం

వర్షాలు పడకుంటే వానకాలం సాగు ప్రశ్నార్థకమే..

నల్లగొండ, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) :  తెలుగు రాష్ట్రాల వరప్రధాయిని నాగార్జున సాగర్ శరవేగంగా ఖాళీ అవుతున్నది. వేసవికి ముందే జలాశయం నీటిమట్టం రోజురోజుకూ పడిపోతున్నది. మరో నాలుగైదు అడుగులు తగ్గితే రిజ్వరాయర్లోని నీరు భవిష్యత్ తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది. రానున్న వానాకాలంలో సకాలంలో వర్షాలు కురవకపోతే సాగుపై ప్రభావం పడే అవకాశముంది. గతంలో నాగార్జునసాగర్ పూర్తిస్థాయిలో నిండితే మూడేండ్లపాటు ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందేది. కానీ ప్రస్తుతం ఏడాదిపాటు (రెండు పంటలకు) మాత్రమే నీరందే పరిస్థితి నెలకొంది. 

24 లక్షల ఎకరాల ఆయకట్టు..  

నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో దాదాపు 24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్షానదికి నిరుడు భారీ వరదలొచ్చాయి. ప్రాజెక్టులన్నీ నిండడంతో సుమారు 850 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో నిండుకుండలా (590 అడుగులు) ఉన్న సాగర్ శుక్రవారం నాటికి 529.9 అడుగులకు చేరింది. మరో ఐదడుగుల మేర నీటిమట్టం తగ్గితే ఇక ప్రాజెక్టులోని నీటిని సాగుకు వినియోగించుకునేందుకు వీలుండదు. తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టులోగా వర్షాలు సమృద్ధిగా కురిసి రిజర్వాయర్ నిండితేనే వానాకాలంలో ఆయకట్టు భూములకు సాగు నీరందించే అవకాశం ఉంటుంది. లేకుంటే రైతులకు ఇబ్బందులు తప్పవు. కాగా నీటి విడుదలపై నీటిపారుదల అధికారుల పర్యవేక్షణ కరువవడంతో జలాలు వృథా అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

సాగర్ జలాశయ నీటిమట్టం ఇలా..

నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్ధాయి నీటిమట్టం 590 అడుగులు(312.0405) టీఎంసీలు కాగా ప్రస్తుతం 529.90 అడుగులు(167.9514) టీఎంసీలుగా ఉంది. కుడి కాలువకు 7,033 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా ఎడమ కాలువకు 8,986 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎస్సెల్బీసీ ఏఎమ్మార్పీకి 1500 క్యూసెక్కులు, లోలెవల్ కెనాల్కు 280క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి మొత్తం 17,799 క్యూసెక్కల అవుట్ ఫ్లో వెళ్తున్నది.