calender_icon.png 22 December, 2024 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారం మాటున దర్జాగా కబ్జా!

07-10-2024 02:37:19 AM

బోడుప్పల్ మున్సిపాలిటీలో కోట్ల విలువైన రోడ్డు స్థలం కబ్జా చేసిన అధికార పార్టీ నాయకుడు 

అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి చేతులెత్తేసిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు

మేడిపల్లి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, చెరువులు రోజురోజుకూ కబ్జాకు గురవుతున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని సొమ్ము చేసుకుంటున్నారు

ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు సైతం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కల్వర్టు కబ్జాకు గురికాగా.. నేడు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి రోడ్డు స్థలాన్ని కబ్జా చేసిన ఓ కార్పొరేటర్ భర్తపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మేయర్ కుమారుడు సామల మనోహర్‌రెడ్డి ఫిర్యా దు చేశారు.

అధికార పార్టీలో ఉంటే ఏమైనా చేయొచ్చనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి రేకుల షెడ్డు వేశారు. తన అధికార బలం ఉపయోగించి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేటర్ భర్తపై ఫిర్యాదు చేయడానికి కాలనీవాసులు భయపడడంతో సామల మనోహర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

అయితే, అధికార పార్టీకి తలొగ్గిన మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులే కబ్జాలకు పాల్పడుతున్నారు. అయితే, మున్సిపల్ అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గారా.. అమ్యామ్యాలకు దాసోహం అయ్యారా అని ప్రజల్లో చర్చ నడుస్తోంది. 

కోట్లు విలువ చేసే స్థలం

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 6, 7, 8 మణికంఠనగర్ చివరలో ఉన్న రోడ్డు స్థలంపై కన్నేసిన కార్పొరేటర్ భర్త గుట్టుచప్పుడు కాకుండా రేకుల షెడ్డు నిర్మించి రూ. కోట్లు విలువ చేసే రోడ్డు స్థలాన్ని కబ్జా చేశాడు. అధికార బలంతో ప్రజాప్రతినిధి భర్త వందల గజాలను కబ్జా చేసి ఏకంగా నిర్మాణమే చేశాడంటే బోడుప్పల్‌లో అధికార పార్టీకి అధికారులు ఎలా తలొగ్గారో అర్థమవుతోంది.

కాగా, రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేయడం నిజమేనని.. ఆ స్థలంలో స్థానికులు చెత్తా చెదారం వేస్తుండడంతో వాసనలు వస్తున్నాయనే ఉద్దేశంతో ఓ షెడ్డు నిర్మించారని మున్సిపల్ అధికారులు కార్పొరేటర్ భర్తకు మద్దతుగా మాట్లాడుతున్నారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.  ఈ విషయంపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

ఆదేశాలు బేఖాతరు 

కార్పొరేషన్ పరిధిలోని చెనాయికుంట నుంచి వర్షం నీరు వచ్చే కాల్వకు చాకలి గండి వద్ద గతంలో కల్వర్టు నిర్మించారు. చాకలి గండి భూమిలో కార్పొరేటర్ భర్త వెంచర్ వేసి నిర్మాణాలు చేశాడు. గతంలో భారీ వర్షాల కారణంగా కాలనీలు నీట మునిగినప్పుడు జిల్లా కలెక్టర్ స్వయంగా అక్కడ పర్యటించి కల్వర్ట్ మూసి అనుమతులు లేకుండా బార్ నిర్మించారని కాలనీవాసుల ఫిర్యాదు మేరకు దానిని వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు.

కానీ, కార్పొరేటర్ అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీలో ఉండటంతో మాజీ మంత్రి ఒత్తిడితో దాన్ని ఆపివేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని నేడు దాని వెనక భాగంలో ఉన్న కోట్ల విలువ చేసే రోడ్డు స్థలంలో కబ్జా చేసి రేకుల షెడ్డు నిర్మాణం చేయడంపై స్థానిక ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు.