నిందితులకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. అధికారుల అండదండలతో తమ పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
తాజాగా అలాంటి ఘటనలో కబ్జాదారులకు సహకరించిన ఓ అధికారిణి కటకటాలపాలైంది. వివరాలిలా ఉన్నాయి.. కుత్బుల్లాపూర్ మండలంలో ఓ ఖాళీ స్థలంపై కన్నేసిన కొందరు ఏకంగా ఆ స్థలం యజమాని మృతిచెందినట్లు పత్రాలను సృష్టించారు. అప్పట్లో కుత్బు ల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న జ్యోతి సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.
యజమాని గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్‌ఎస్ మహిళా నేతతో పాటు మరో ఐదుగురిని అక్టోబర్ 4న అరెస్ట్ చేసిన పోలీసులు.. రిజిస్ట్రేషన్‌కు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని మంగళవారం అరెస్ట్ చేసి మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.
కేసు నేపథ్యం
ఉప్పుగూడ హనుమాన్ నగర్‌కు చెందిన లెండ్యాల సురేశ్‌కు కుత్బుల్లాపూర్ మండలం సుభాష్‌నగర్‌లోని వెంకటాద్రినగర్‌లో 200 గజా ల స్థలం ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం స్థలం విలువ రూ.కోటి వరకు ఉంటుంది. ఆ స్థలం ఖాళీగా ఉన్నట్లు సుబాష్‌నగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ మహిళా నేత పద్మజారెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క గుర్తించింది.
హయత్‌నగర్‌కు చెందిన రేపాక కరుణాకర్‌ను సంప్రదించింది. రూ. 3.50 లక్షలు చెల్లించి నకిలీ పత్రాల తయారీకి ఒప్పందం చేసుకుంది. ఇంటి యజమాని 1992లోనే మృతిచెందినట్లు మరణ ధ్రువీకరణ పత్రం తయారు చేశారు. రవిశంకర్ అనే వ్యక్తిని అతడి కుమారుడిగా సృష్టించారు. ఆధార్ కేంద్రం ఆపరేటర్ గగనం నరేంద్ర సహకారంతో హరీష్ అనే వ్యక్తిని రవిశంకర్‌గా చూపించేందుకు నకిలీ పాన్‌కార్డు తయారు చేయించారు.
దీంతో ఆధార్‌లో పేరు మార్పులు చేశారు. 2023 ఫిబ్రవరిలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సాయంతో పద్మజారెడ్డి సోదరి నాగిరెడ్డి కోమలకుమారికి ఈ స్థలాన్ని రవిశంకర్ విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. ఆ తర్వాత స్థలం యజమాని లెండ్యాల సురేశ్ ఫిర్యాదుతో అసలు బాగోతం బయటకు రావడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.