calender_icon.png 25 November, 2024 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాజిటివ్ ట్రెండ్

25-11-2024 12:11:27 AM

గ్లోబల్ సంకేతాలపై దృష్టి

  1. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేడు ఇన్వెస్టర్ల స్పందన
  2. మార్కెట్ కదలికలపై విశ్లేషకుల అంచనాలు

ముంబై,  నవంబర్ 24: శనివారం వెలువడిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ స్పందించిన అనంతరం గ్లోబల్ సంకేతాలు, విదేశీ ఫండ్స్ ట్రేడింగ్ యాక్టివిటీ ఇన్వెస్టర్లు దృష్టి మళ్ళిస్తారని విశ్లేషకులు తెలిపారు. 

ఈ వారం మార్కెట్ ట్రెండ్‌కు గ్లోబల్ సంకేతాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ సరళే కీలకమని చెప్పారు.  వరుస ఆరు వారాలుగా పతనం చవిచూసిన సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం భారీగా రిలీఫ్ ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,536 పాయింట్లు, నిఫ్టీ 374 పాయింట్ల చొప్పున పెరిగాయి. 

మహారాష్ట్ర ఫలితాలతో సెంటిమెంట్ మెరుగు

దేశీయంగా చూస్తే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్‌కు కీలకమేనని, ముఖ్యంగా మహారాష్ట్రలో ఎన్‌డీఏ సాధించిన ఘనవిజయం మార్కెట్  బుల్లిష్ సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తుందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. అయితే రష్యా,ఉక్రెయిన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ధరల పెరుగుదల తదితర గ్లోబల్ అంశాలు మార్కెట్ ట్రెండ్‌కు రిస్క్‌లని వెల్లడించారు.

యూఎస్ డాలర్ బలోపేతంకావడం, యూఎస్ బాండ్ ఈల్డ్స్ గరిష్ఠస్థాయికి పెరగడం దేశీయ కరెన్సీ రూపాయిని బలహీ నపరుస్తుందని, దీనితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగవచ్చని మీనా హెచ్చరించారు. అందుచేత ఎఫ్‌పీఐల పెట్టుబడుల దిశ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని తెలిపారు.

జీడీపీ వృద్ధి రేటు, ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ తదితర యూఎస్ అంశా లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని చెప్పారు. మహారాష్ట్ర ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉంటుందని, మౌలిక సదుపాయాలకు సంబంధించిన రంగాల షేర్లు రాణిస్తాయని  మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ అరోరా చొప్రా అంచనా వేశారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 26,533 కోట్లు

 దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) ఈ నవంబర్ నెలలో కూడా భారీగా నిధుల్ని వెనక్కు తీసకుంటున్నారు.  నవంబర్ నెలలో ఇప్పటివరకూ రూ.26,533 కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్‌పీఐలు  నికరంగా విక్రయించారు.

అక్టోబర్ నెల మొత్తంలో రికార్డు స్థాయిలో రూ. 95,000 కోట్ల పెట్టుబడుల్ని మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న విదేశీ ఫండ్స్ నవంబర్‌లో సైతం నికర విక్రయాలను కొనసాగిస్తున్నాయి. అయితే ఈ నెలలో అక్టోబర్‌తో పోలిస్తే ఈక్విటీ అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. మొత్తంమీద 2024లో ఇప్పటివరకూ ఈ ఫండ్స్ భారత మార్కెట్లో రూ.19,940  కోట్ల  నికర విక్రయాలు జరిపాయి.

రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానా లు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 

సెల్ ఇండియా, బై చైనా ట్రేడ్ ముగిసింది

విదేశీ ఇన్వెస్టర్లు రెండు నెలలుగా అనుసరిస్తున్న ‘సెల్ ఇండియా, బై చైనా’ ట్రేడ్ ముగిసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. యూఎస్‌లో స్టాక్ విలువలు గరిష్ఠస్థాయికి చేరినందున, ‘ట్రంప్ ట్రేడ్’ కూడా లాస్ట్ లెగ్‌లో ఉన్నట్లు కన్పిస్తున్నదని అన్నారు.

ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు ఐటీ షేర్లను కొనుగోలు చేస్తున్నారని, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నా, దేశీయ సంస్థల మద్దతు ఫలితంగా వాటి క్షీణత తక్కువగా ఉన్నదని విజయ్‌కుమార్ వివరించారు.  గరిష్ఠస్థాయి నుంచి భారత్ మార్కెట్ 10 శాతం పడిపోగా, చైనా మార్కెట్లు సైతం 10 శాతం క్షీణించాయని, యూఎస్ మార్కెట్ మాత్రం  10 శాతం ర్యాలీ జరిపిందని తెలిపారు.