15-02-2025 01:06:48 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): దండాలు పెడితే పదవులు రావని, ఢిల్లీ నుంచి పైరవీలతో కాదు గల్లీలో పేదల కోసం పనిచేసే వారినే పదవులు వరిస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో డబ్బుతో ఎవరూ గెలవలేరని, డబ్బులే గెలిపిస్తాయంటే కేసీఆర్‌కు 100 సీట్లు వచ్చి ఉండేవని చెప్పారు.
శుక్రవారం గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.. ‘గట్టి గా కొడతానని అంటున్న కేసీఆర్‌కు ఈ వేదికగా చెబుతున్నా.. గట్టిగా కొట్టాలంటే దుర్మార్గంగా ప్రజలను దోచుకున్న నీ కొడుకును, అల్లుడిని, బిడ్డను కొట్టు..’ అంటూ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ బయటకు వస్తానని చెప్పుకుంటుండు..
బయటకు వచ్చి ఏం చేస్తాడు.. నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే నిన్ను బండకేసి కొట్టి ప్రజలు ఓడగొట్టారు.. మళ్లీ బయటకు వచ్చి చేసేదేముంది..’ అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. “రైతులకు రుణమాఫీ చేశాం...కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధు వేశాం.. దేశంలో కులగణన చేసిన ఏకైక రాష్ర్టం తెలంగాణ.
మాదిగ ఉపకులాల వర్గీకరణను అమలు కోసం నిర్ణయం తీసుకు న్నాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ దుష్ర్పచారం చేస్తోందని.. చానెళ్లు, పేపర్లు ఉన్నప్పుడే కాంగ్రెస్‌ను ఏమీ చేయలేకపోయారని.. సోషల్ మీడియాతో చేసేందేముందన్నారు. యువజన కాంగ్రెస్ అనుకుంటే ఒక్కసారి కాదు.. నాలుగు సార్లు గెలిపిస్తారని స్పష్టం చేశారు.
మోదీపై పోరాటమే..
తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్వని ప్రధాని మోదీపై పోరాటానికి సమయం కోసం వేచిచూస్తూ సంయమనం పాటిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే అన్ని సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామని, ప్రజాసమస్యలపై కేం ద్రంపై చేసే పోరాటంలో ముందుభాగాన నిలవాలని యువజన కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మందకృష్ణను ఎన్నోసార్లు కౌగిలించుకున్నారని, కానీ అది ధృతరాష్ర్ట కౌగిలిగానే మిగిలింది తప్ప వర్గీకరణ అమలు చేయలేదన్నారు.
యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు..
యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన చాలామం ది జాతీయస్థాయి, రాష్ర్టస్థాయి రాజకీయాల్లో రాణించారని, రాజకీయాల్లో యువ జన కాంగ్రెస్‌ను మొదటి మెట్టుగా భావించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్ర రాజకీయ నేతలంతా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారన్నారు.
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్‌పైనే ఉందన్నారు. పార్టీ అనుబంధ విభాగాల్లో బాధ్యత తీసుకున్న వారికి ప్రభుత్వంలో స్థానం కలిపిస్తామని గతంలో చెప్పామని.. 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులను అనుబంధ విభాగాలకు అందించా మన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో యువత ఎక్కువగా పాల్గొనాలని సూచించారు.