21-03-2025 01:07:11 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు
ఖమ్మం, మార్చి 20 ( విజయక్రాంతి ):-భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నెల్లూరి కోటేశ్వరరావు, ధర్మ రక్షణ, ప్రజా శ్రేయస్సు, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని గురువారం ఖమ్మం లోని శ్రీరామచంద్రుని సన్నిధిలో ప్రమాణం చేశారు.
పార్టీ అధిష్టానం తనపై ఉంచిన గౌరవప్రదమైన బాధ్యతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, జిల్లాలో బీజేపీ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడే కార్యకర్తలకు, నాయకులకే జిల్లా నాయకత్వం పదవులు, బాధ్యతలు కట్టబెడుతుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు.కాషాయ జెండాను చేతిలో పట్టుకోవడం కాదు, దాని ఆవశ్యకతను ప్రతి గడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ప్రజల చిన్న కష్టంలోనూ కార్యకర్త అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారమే పార్టీ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. 24 గంటలూ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలాన్ని చాటేందుకు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన నాయకులు, కార్యకర్తలను కోరారు.
త్వరలో కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పిన కోటేశ్వరరావు, ప్రతి క్షణం దేశ సేవకు అంకితం చేసి, ప్రజల విశ్వాసం చొరగొనాలని పిలుపు నిచ్చారు.సాంకేతికతను బలంగా వినియోగించు కుని, ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయాలి. పార్టీ కుటుంబంగా ఐక్యంగా నడిస్తేనే విజయం సాధ్యం,‘ అని ఆయన ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసంపూడి రవీందర్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.