calender_icon.png 23 September, 2024 | 5:01 AM

పని చేస్తేనే పదవి

23-09-2024 02:44:09 AM

  1. ప్రజల్లో ఉన్నవారికే డీసీసీ అధ్యక్ష ఛాన్స్ 
  2. కష్టపడినవారికే ప్రభుత్వంలో పదవులు 

పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో సాగాలి 

బీసీ కుల గణన రాహుల్‌గాంధీ ఆకాంక్ష 

నాలుగోసారి గెలిచేందుకే మోదీ జమిలి కుట్ర 

అసహనంలో బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం 

ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల్లో పర్యటించాలి

సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పార్టీ, ప్రభుత్వం సమన్వ యంతో ముందుకు వెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ప్రజలోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు (డీసీసీ) ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సీఎం సూచించారు. ఆదివారం హైటెక్ సిటీ సమీపంలో ఒక ప్రైవేట్ హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చామని, లోక్‌సభ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలిచామని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాల్సిన అవసరం ఉన్న సమయంలో పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు చేపట్టారని చెప్పారు. మోదీ నాలుగోసారి గెలవడం కోసమే జమిలి ఎన్నికలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. జమిలి ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొమ్మిది నెలల్లో తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, ప్రభుత్వం చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రజల్లోకి తీసకెళ్లాలని కోరారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. బీసీ కుల గణ న చేయాలన్నది రాహుల్‌గాంధీ బలమైన ఆలోచన అని, రాహుల్ ఆలోచన మేరకే బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని చెప్పారు. పార్టీ అనుబంధ సంఘా ల్లో పని చేసిన 36 మందికి నామినేటెడ్ పో స్టులు ఇచ్చామని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసినందుకే వారిని గు ర్తించామని వెల్లడించారు. భవిష్యత్‌లో కూ డా పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా అవకాశాలుంటాయని సీఎం పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘం వేశాం 

ఎస్సీ వర్గీకరణ అమలుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 27 రోజుల్లో రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని అన్నారు. రైతును రుణవిముక్తున్ని చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిట్ కార్డు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అధికారం కోల్పోయిన అసహనంతో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం మండ్డిపడ్డారు. ఇన్‌చార్జ్ మంత్రులు వారానికి రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సూచించారు. 

స్థానిక ఎన్నికల్లో 90 శాతం మనమే గెలవాలి 

పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తానని, పార్టీని ముందుకు నడపడంలో సమష్టి బాధ్యత అవసరమని పీసీసీ అధ్యక్షడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. కార్యక ర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటానని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా పని చేస్తానని తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. స్థానిక  సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలని, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులపై ఈ బాధ్యత ఎక్కువగా ఉందని చెప్పారు. స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాలు గెలవాలని టార్గెట్ విధించారు. ప్రభుత్వం అనేక సంక్షే మ కార్యక్రమాలను అందిస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సీఎం, తాను ఎంతో మమేకమై పని చేశామని, అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయ కుండా పని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. కేసీఆర్ అబద్ధాలతో పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించారని, రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. దేశానికి రాహుల్ ఆశాకిరణమని, ఆయన్ను ప్రధాని చేసేందుకు మనందరం కష్టపడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. 

మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సన్మానం 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సీఎల్పీ ఘనంగా సన్మానం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. మహేశ్‌కుమార్‌గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.  

ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం: మంత్రి శ్రీధర్‌బాబు 

ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసినా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా, తన సొంత పత్రిక ద్వారా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో బీఆర్‌ఎస్ ప్రభత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల కాలంలో చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని మంత్రి పేర్కొన్నారు. బీసీ కుల గణన చేస్తామని రాహుల్‌గాంధీనే చెప్పారని, తమ ప్రభుత్వం కూడా కుల గణనపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని తెలిపారు. బీసీ కమిషన్ కూడా వేశామని మంత్రి గుర్తుచేశారు.