కాంచీపురం (తమిళనాడు): తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో హిందువులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆడి పండుగ (పార్వతి దేవిని పూజించే)కోసం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫొటో కనిపించడం వివాదానికి దారి తీసింది. ఈ హోర్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడి పండుగ కోసం కురువిమలైలోని నాగతమ్మన్, సెల్లియమ్మన్ ఆలయాల వద్ద పండుగ దీపాలతో పాటు హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు.
హోర్డింగ్ లలో దేవుళ్ల చిత్రాలతో పాటు మియా ఖలీఫా ఫొటోలను కూడా ముద్రించారు. ఆ ఫొటోల్లో మియా ఖలీఫా పాలపాత్రని మోసుకెళ్తున్నట్లు చూపించారు. దీనికి తోడు హోర్డింగ్ ఏర్పాటు చేసినవారి ఫొటోలను కూడా హోర్డిం గ్ కింది భాగంలో ముద్రించారు. ఆయా హోర్డింగ్‌లకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే వాటిని తొలగించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.