ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో క్రికెట్ క్రీడకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న తల్లిదండ్రులు జోగు బోజమ్మ, ఆశన్న ల జ్ఞాపకార్థం ఆదిలాబాద్ లో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ క్రీడకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ మంత్రి జోగు రామన్న క్రీడాకారులకు కల్పిస్తున్న అవకాశాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. రామన్న స్ఫూర్తితో బోథ్ లో సైతం వివిధ క్రీడాలలో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ క్రీడాకారుడు హిమ తేజ ఇలాంటి వేదికల ద్వారానే నేడు బీసీసీఐ క్రికెట్ స్థాయిని ఎదగడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అజయ్, యూనిస్ అక్బర్, మెట్టు ప్రహ్లద్, నారాయణ, సాజిదోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.