calender_icon.png 29 September, 2024 | 5:00 AM

ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత

29-09-2024 03:03:57 AM

సాహిత్యరంగంలో విశేష కృషి

నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రముఖ రచయిత్రి, పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి, ఐఏఎస్ అధికారి బొజ్జా రాహుల్ తల్లి విజయభారతి (83) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్సపొందుతూ శనివారం ఉదయం సనత్‌నగర్ రెనోవా హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.

విజయ భారతి ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో 1941లో జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ రచయిత బోయి భీమన్న, తల్లి నాగరత్నమ్మ. చిన్నతనం నుంచే కుసుమ ధర్మన్న వంటి ప్రముఖ దళితోద్యమ నాయకులతో పరిచయమున్న కుటుంబ వాతావరణంలో పెరిగారు. విజయ భారతి కోఠిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు.

‘దక్షిణ దేశీయాంధ్ర వాజ్ఞయం సాంఘిక పరిస్థితులు’ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో డాక్టరేటు పొందిన రెండో మహిళ విజయభారతే కావడం విశేషం. తెలుగు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రాచీన సాహిత్యకోశం, ఆధునిక సాహిత్యకోశం ఆమె సంపాదకత్వంలోనే వెలువడ్డాయి.

ప్రముఖ హేతువాది, దళిత నాయకుడు, న్యాయవాది బొజ్జా తారకంతో 1968లో వివాహమైంది. భారతీయ కులవ్యవస్థ స్వరూప, స్వభావాల గురించి పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా విశ్లేషణలు చేస్తూ రచనలు చేశారు. ఆమె రాసిన షట్చక్రవర్తులు అనే పుస్తక శృంకలానికి 2003లో కెనడాలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ మిషనరీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అవార్డులు దక్కాయి. 

సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం

ప్రముఖ రచయిత్రి విజయభారతి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత బోయ భీమన్న కుమార్తె విజయభారతి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించడంతోపాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వెలువరించారని గుర్తుచేశారు. సాహితీ రంగానికి ఆమె చేసిన సేవలు అపారమైనవవి కొనియాడారు. రాహుల్ బొజ్జాతోపాటు వారి కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు. 

సామాజిక అధ్యయన శీలి విజయభారతి: మాజీ సీఎం కేసీఆర్

విజయ భారతి మృతిపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. సాహిత్య, సామాజిక అధ్యయన శీలిగా విశ్లేషకులుగా ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్‌గా సేవలందించిన విజయ భారతి అంబేద్కర్ రచనలు, ప్రసంగాల సంపుటాలను సంపాద కురాలుగా, మహాత్మాజ్యోతిరావు పూలే జీవిత చరిత్రను తెలుగు సమాజానికి మొట్టమొదటి సారి అందించిన రచయిత్రి అని కొనియాడారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.