- రాయికోడ్ గోదావరి ఆగ్రోలో టన్నుకు రూ. 3,400
- సంగారెడ్డి గణపతి ఫ్యాక్టరీలో రూ. 3,682
- గిట్టుబాటు కాదని రైతుల ఆవేదన
- మద్దతు ధర పెంచాలని డిమాండ్
సంగారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరకు రైతులకు ప్రోత్సాహక ధర పెంచకపోవడంతో రైతులకు మద్దతు ధర లభించడం లేదు. రాయికోడ్ మండలంలోని మాటూర్ శివారులో ఉన్న గోదావరి ఆగ్రో చక్కర ఫ్యాక్టరీని కొత్తగా ఈ నెల 8న మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రారంభించారు.
సంగా రెడ్డిలో గణపతి ఫ్యాక్టరీ, రాయికోడ్‌లో గోదావరి ఆగ్రో, నారాయణ్‌ఖేడ్ సమీపంలో కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ లో ఉన్న మాగి ఫ్యాక్టరీలో క్రషింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయికోడ్ మండలం మాటూర్ శివారులో ఉన్న ఫ్యాక్టరీ వారు టన్ను చెరుకుకు రూ.3,400, సంగారెడ్డిలోని గణపతి ఫ్యాక్టరీ వారు రూ.3,682 మద్దతు ధర ప్రకటించిన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీలు మద్దతు ధర పెంచకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకొన్నాయి. సాగు ఖర్చులు పెరిగినా ఫ్యాక్టరీలు మద్దతుధర పెంచకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఎరువులు, మందులు, కూలీ ఖర్చులు పెరిగాయి. చెరకును నరికేందుకు కూలీల కొరత తీవ్రంగా ఉంది.
దీంతో రైతులు అడ్వాన్సులు చెల్లించి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. ప్రైవేట్ చక్కెర ఫ్యాక్టరీల యాజమానులు సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు చేసి కూలీలకు, లారీలకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.
గోదావరి ఆగ్రా ఫ్యాక్టరీ క్రషింగ్‌కు సిద్ధం
రాయికోడ్ మండలం మాటూర్‌లో ఉన్న గోదావరి ఆగ్రో ఫ్యాక్టరీలో ఈనెల 8న మంత్రి దామోదర్ రాజనర్సింహా క్రషింగ్ సీజన్‌కు పూజలు చేసి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో 8 వేల మంది రైతులు 25 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 11 లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెరకు క్రషింగ్ చేసేందుకు ఫ్యాక్టరీల వారీగా కేటాయించింది. సంగారెడ్డిలోని గణపతి ఫ్యాక్టరీకి లక్షా 50 వేల టన్నులు, రాయికోడ్‌లోని గోదావరి ఆగ్రోకు 3 లక్షల టన్నులు, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మాగి ఫ్యాక్టరీకి 50 వేల టన్నులు, కామారెడ్డిలో ఉన్న గాయత్రి ఫ్యాక్టరీకి లక్ష టన్నులు, కొత్తకోట కృష్ణవేణికి లక్ష టన్నులు కేటాయించారు.
జహీరాబాద్ మండలం కొత్తూర్(బీ) లో ఉన్న ట్రైడెంట్ ఫ్యాక్టరీ గతేడాది చెరకు క్రషింగ్ చేయకపోవడంతో రైతులు కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న ఫ్యాక్టరీలకు చెరకును సరఫరా చేశారు. ఈ ఏడాది ఈ పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీలకు చెరకును కేటాయించింది.
చెరుకు రైతులకు కేంద్రం దగా
చెరుకు పండించే రైతులకు కేంద్రం ఎఫ్‌ఆర్‌పీ (ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్)ను అమలు చేస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రైవేట్ ఫ్యాక్టరీలకు అనుకులంగా ఉండటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి 35 టన్నుల దిగుబడి వస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది.
ఫ్యాక్టరీల యాజమాన్యాలు ముడిసరకు లాభాలను రైతులకు పంచాలి. చెరకు క్రషింగ్ ద్వారా వచ్చే వ్యర్థాలను అమ్మడం ద్వారా ఫ్యాక్టరీలు లాభాలు గడిస్తున్నాయి. తమకు మాత్రం నష్టాలే వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర ధరకు సమానమైనంగా తమకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి
చెరకు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో రైతులు సాగు చేస్తున్న చెరకును ఇతర ఫ్యాక్టరీలకు తరలించేం దుకు ప్రభుత్వం ఏర్పా ట్లు చేస్తుంది. రాయికోడ్‌లో ఉన్న గోదావరి ఆగ్రో ఫ్యాక్టరీ మద్దతు ధరకు టన్నుకు రూ.3,400 ప్రకటించింది. సంగారెడ్డిలోని గణపతి ఫ్యాక్టరీ వారు టన్నుకు రూ. 3,682 ప్రకటించారు. మిగత ఫ్యా క్టరీలు మద్దతు ధర ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
రాజశేఖర్, చెరుకు సహాయ కమిషనర్, సంగారెడ్డి