calender_icon.png 25 November, 2024 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దులు దాటుతున్న బీదల బియ్యం

22-11-2024 02:30:07 AM

  1. కామారెడ్డి జిల్లాలో రైస్‌మిల్లర్ల అక్రమార్కులు
  2. అక్రమంగా దేశ విదేశాలు దాటిస్తున్న వైనం..
  3. తూతూమంత్రంగా అధికారుల స్పందన
  4. రికవరీ ఇస్తామని రైస్ మిల్లర్లను ఒప్పించడంతోనే సరి

నిజామాబాద్, నవంబర్ 2౧ (విజయక్రాంతి): బీదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ లక్ష్యానికి రైస్ మిల్లర్లు ఎప్పటికప్పుడు గండి కొడుతునే ఉన్నారు. ఫలితంగా ప్రభుత్వం సేకరించిన బియ్యం సామాన్య ప్రజలకు చేరడం లేదు.

దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న బీద బిక్కి, మధ్య తరగతి పేదలకు లబ్ధి చేకూరడం లేదు. పౌర సరఫరాలు, జిల్లా యంత్రాంగం చేస్తున్న దాడుల్లో ఈ అక్రమాలు పదే పదే రుజువవుతున్నాయి. అరకొర చర్యలను లైట్‌గా తీసుకుంటున్న రైస్ మిల్లర్లు తిరిగి అక్రమాలకు పాల్పడుతున్నారు.

సీఎంఆర్ కింద బియ్యాన్ని అప్పగించని మిల్లుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన సొమ్ము రికవరీ చేయాలని మంత్రి ఆదేశించడంతో అధికారుల్లో కదలిక మొదలైంది. దీనిలో భాగంగా 65 మిల్లులకు పైగా నోటీసులు  అందాయి. యాజమాన్యాల నుంచి రూ.250 కోట్ల సొమ్ము రికవరీ చేయాల్సి ఉన్నది.

పూర్తిగా చేతులెత్తేసిన మిల్లర్ల నుంచి ఆర్‌ఆర్ యాక్టివ్ ద్వారా వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా తనిఖీ చేసిన అధికారులు 45 పైగా బిల్లుల యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. 

అక్రమాలు ఇలా..

జిల్లాలో లెక్కకు మించిన బియ్యం అక్రమార్కుల దోచుకోగా, ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు  కాలేదు. నిజమాబాద్ నగర శివారులోని ఓ ప్రముఖ రైస్‌మిల్లు గోదాము నుంచి రూ.2.5 కోట్లు విలువైన బియ్యం మాయమైనట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ విషయాన్ని అధికారులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

గతంలో బోధన్ మాజీ ఎమ్మెల్యేకు చెందిన రైస్‌మిల్లులో రూ.83 కోట్ల రూపాయల మేరకు బియ్యం గోదాము నుంచి మాయమైందనే ఆరోపణలపై  కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని ఏఆర్ అగ్రో రైస్ మిల్లు పరిధిలో 32 వేల క్వింటాళ్ల బియ్యం గ్రీన్ ల్యాండ్స్ రైస్ మిల్క్ చెందిన 31 వేల క్వింటాళ్ల గోడౌన్‌లో లేనట్లు తేలింది.

రేషన్ షాపుల్లో రెండు, మూడు బస్తాల బియ్యం తేడా వస్తేనే ఆగమేఘాలపై డీలర్‌షిప్‌ను రద్దు చేసి కేసులు నమోదు చేసే అధికారులు  వేలకు వేల బస్తాల బియ్యం  పక్క దారి పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పంపిణీ.. అర్హులు.. 

జిల్లాలో 7,32,445 క్వింటాళ్ల బియ్యం బియ్యం ప్రతినెలా లబ్ధిదారుకలు పంపిణీ అవుతుంది. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 4,02,022 మంది ఉండగా, వీరిలో ఎక్కువ మందికి 7,509 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ అందుతుంది. మిల్లుల్లోని గోదాముల్లో బియ్యం మాయవుతున్న సంగతి మిల్లర్ల పంపకాల్లో తేడా వచ్చినప్పుడు, ఆ వర్గానికి చెందిన వారే విషయాన్ని బయటపెడుతున్నారు.

అధికారులు ఈ విషయాలను తెలుసుకని కూడా, వాటిని ఏ మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రైస్ మిల్ దందాలో ఘనాపాఠి అయిన ఒక రైస్‌మిల్ యాజమాని గోదాముల నుంచి దారిమళ్లించిన బియాన్ని నగదుగా మార్చే పనిలో ఉన్నట్లు తెలిసింది.

అతడి అక్రమాలపై అధికారులను వివరణ కోరగా.. సదరు రైస్ మిల్లర్ బియ్యానికి తగిన ధాన్యాన్ని ఇస్తామని వారు రాసిచ్చారని చెబుతుండడం గమనార్హం. మరోవైపు కొందరు రైస్ మిల్లర్ వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని దేశ, విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం.