12-04-2025 12:08:17 AM
- టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్
- కొత్తపేటలోని బీజేఆర్ భవనంలో ఫూలే జయంతి వేడుకలు
ఎల్బీనగర్, ఏప్రిల్ 11: దేశంలోని 90 శాతం ఉన్న పేద వర్గాలకు విద్య, ఉద్యోగ తదితర అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించినప్పుడే మహాత్మా జ్యోతిబా ఫూలే కు నిజమైన నివాళి అని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్ లో శుక్రవారం మహాత్మా జ్యోతిబిపూలే, అంబేద్కర్ జయంతితోపాటు బీపీ మండల్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో ఇంకా వివక్ష కొనసాగుతుందని, రాజస్థాన్ లో సీఎల్పీ నాయకుడు గుడికి వెళ్తే.. అపచారం జరిగిందని చెబుతూ.. ఆ తర్వాత ఆ దేవాలయాన్ని శుద్ధిచేసిన తీరు ఇటీవల చోటు చేసుకుందన్నారు. జ్యోతిబాఫూలే కాలం నాటి వివక్ష ఇంకా కొనసాగడం దారుణమని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయాలతోనే రాహుల్ గాంధీ పేద వర్గాలకు అన్ని రంగాల్లో సమాన వాటా దక్కాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకు 50శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని పోరాడుతున్నట్లు తెలిపారు. జ్యోతిబాఫూలే తదితర మహానీయుల జయంతులు, వర్ధంతులు, విగ్రహాల ఏర్పాటు కాకుండా.. పేదలకు సమాజంలో సమాన హక్కులు కల్పించినప్పుడే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జైహింద్ గౌడ్, చామకూర రాజు, రఘురాం నేత, కోల జనార్ధన్, ఉపేంద్ర, కేవీ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దాము మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.