10-04-2025 02:22:35 AM
గిరిజన తండాలో సన్నబియ్యం భోజనం చేసిన ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 9 (విజయ=క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్న బియ్యంతో భోజనం చేసి ఆనందం గా, ఆరోగ్యంగా ఉండాలని తమ ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండలం రావి పహాడ్ తండాలో బానోత్ శంకర్ నాయక్ కాంతి ఇంట్లో ఎమ్మెల్యే, ఆర్డిఓ, పార్టీ నాయకులు గిరిజనులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు.
పేదల కడుపు నింపాలని ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి హాయంలో రూపాయి 90 పైసలకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పేదల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ ఈ దేశంలో ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. దొడ్డు బియ్యం ఇవ్వడంతో వాటిని తినకుండా అమ్ముకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించి అమలు చేశారని అన్నారు.
దేశంలో రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తున్న ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. సన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటున్న బిజెపి నాయకులు వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. సన్న బియ్యం లబ్ధిదారులందరూ ఎంతో సంతోషంగా భోజనం చేస్తూ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుని అధోగతి పాలు చేసిన నేపథ్యంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని అన్నారు. టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రజాభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఎక్కడ తప్పులు దొరుకుతాయని ఎదురుచూస్తూ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోక ప్రభుత్వాన్ని దీవించుదాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే లక్ష్యంతో తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.