22-04-2025 01:41:20 AM
నిజామాబాద్ ఎంపీ అరవింద్
నిజామాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం నిజామా బాద్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులను కాంగ్రెస్ పార్టీ వంచిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న సామాన్య ముస్లింల కోసమే వక్ఫ్ చట్టంలో మార్పులు తెచ్చామని ఆయన స్పష్టం చేశారు.
వక్సు చట్టం ఓవైసీ కోసం ప్రత్యేకించిందేమీ కాదని ఆయన ఎద్దేవ చేశారు. మహమ్మద్ ఘోరీ సమయంలోనే ఈ ప్రక్రియ మొదలైందని పార్లమెంటులో పూర్తి మెజార్టీతో చట్టంగా రూపు దాల్చుకుందని ఆయన తెలిపారు. బీద ఆర్థిక బలహీన వర్గాల ముస్లింలను విద్యావంతులుగా ఎదగకుండా అడ్డుకోవడానికి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సొంత లబ్ధి కోసమే కొందరు మైనార్టీ నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారని అరవింద్ ఆరోపించారు.
వక్ఫ్ ఆస్తులు పేదలకు విద్యా వైద్యం కోసం వెచ్చించాలని చట్టం చెబుతోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో వక్ఫ్ బోర్డుకు ఓట్ల కోసం కక్కుర్తి తో న్యాయపరమైన హక్కులు కల్పించాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్ చట్టాన్ని ప్రతి భారత పౌరుడు ఆమోదించాల్సిందేనని.. ఆయన అన్నారు. వక్ఫ్ చట్టం వ్యతిరేక ర్యాలీలకు అనుమతి ఎలా ఇస్తారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. మార్పులు చేసిన వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని అందుకే ముస్లిం సోదరులు అధిక మొత్తంలో వక్ఫ్ చట్టానికి మద్దతు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ అరవింద్ తెలిపారు.