బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రోడ్ల పక్కనే చెత్తకుప్పలు
స్వైర విహారం చేస్తున్న దోమలు, పందులు
పట్టించుకోని పాలకులు, అధికారులు
మేడిపల్లి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు శాపంగా మారింది. చెత్త నిర్వ హణపై అధికారులకు చిత్తశుద్ధి లేని కారణం గా కార్పొరేషన్ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి.
ప్రధాన రోడ్డుతో పాటు కాలనీ రోడ్ల వెంట చెత్త పేరుకుపోవడంతో దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతోప్రజలు రోగాల బారినపడుతున్నారు. చెత్త సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు.
పట్టించుకోని పాలకులు..
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సమస్యపై పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకవర్గ సభ్యులు రోజులో ఒక్క సారైనా బోడుప్పల్ ప్రధాన రహదారి వెంట ప్రయాణం చేస్తారు. కానీ, ఆ రోడ్డుకు ఇరువైపులా డంపింగ్ యార్డును తలపించేలా చెత్త కుప్పలుగా పేరుకుపోయినా మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్లు తమకేమీ కనిపించలేదు అన్నట్లుగా ఉంటున్నారు.
ఇటీవల స్వచ్ఛతా హీ సేవా కార్యక్ర మంలో భాగంగా ‘స్వచ్ఛ బోడుప్పల్’ పేరు తో బోడుప్పల్ పాలకవర్గ సభ్యులు హంగా మా చేశారు తప్పా, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో పాటు పాలకుల కు కూడా చిత్తశుద్ధి లేదని ప్రజలు వాపోతున్నారు. అయితే రోడ్లపై, రోడ్లకు ఇరువైపులా చెత్త వేస్తే జరిమానాలు విధిస్తామని గతంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు చెప్పిన మాటలు అమలుకు నోచుకోవడం లేదు.
పందుల స్వైరవిహారం..
కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారడంతో చెత్త కుప్పలుగా పేరుకుపోయి దుర్వాసన వస్తోందని సమీప కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లేవారు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చెత్తకుప్పల కారణంగా దోమలు, పందు లు స్వైర విహారం చేస్తున్నాయని, దోమల నివారణకు అధికారులు ఫాగింగ్ నిర్వహించడం లేదని ప్రజలు వాపోతున్నా రు. ఇప్పటికైనా స్పందించి చెత్త సమస్య ను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై వివరణ కోసం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.