calender_icon.png 29 November, 2024 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదింటి పిల్లల ఫ్యాషన్ షో!

26-11-2024 12:00:00 AM

లక్నోకు చెందిన పేద విద్యార్థులు తమ ఫ్యాషన్ షోతో అద్భుతాన్ని సృష్టించారు. మురికివాడలో ఉండే పేద విద్యార్థులు తీసిన వీడియో వాళ్లను సెలబ్రిటీలుగా మార్చివేసింది. 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఆ వీడియోలో కనిపిస్తుంటారు. వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే. వారంతా ఎరుపు, బంగారు రంగు దుస్తులు ధరించారు. అవన్నీ కొందరు వాడి వదిలేసిన దుస్తులతో తయారు చేసిన డ్రెస్‌లే. ఆ డ్రెస్‌లను ఆ పిల్లలే రీడిజైన్ చేసి కుట్టుకున్నారు. మోడళ్ల మాదిరిగా ప్రదర్శన నిర్వహించారు. ర్యాంప్ వాక్ చేశారు. మురికివాడల్లోని గోడలు, మిద్దెలు వారి ర్యాంప్ వెనక బ్యాక్‌డ్రాప్‌గా కనిపిస్తాయి. 

‘ఇన్నొవేషన్ ఫర్ చేంజ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ నెల ఆరంభంలో ఈ వీడియో మనకు కనిపిస్తుంది. ఇన్నొవేషన్ ఫర్ చేంజ్ అనేది లఖ్‌నవూకు చెందిన స్వచ్ఛంద సంస్థ. నగరాల మురికివాడల్లోని 400 మంది చిన్నారుల కోసం ఈ స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది. వారికి ఆహారం, విద్య, ఉద్యోగ నైపుణ్యాల శిక్షణ అందిస్తోంది. వీడియోలో కనిపించిన చిన్నారులు ఈ ఎన్జీవో ద్వారా సాయం పొందుతున్న విద్యార్థులు.

బాలీవుడ్ నటుల దుస్తులను ఇన్‌స్టాగ్రామ్‌లో గమనిస్తుంటామని, వాటిలో కొన్ని దుస్తుల అనుకరణలను తరచుగా తమ కోసం తయారు చేసుకుంటుంటామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ వీడియో కోసం పిల్లలు బాలీవుడ్ సెలబ్రిటీలకు, హాలీవుడ్ నటీమణులకు, బిలియనీర్లకు దుస్తులు డిజైన్ చేసే సబ్యసాచి ముఖర్జీ ఫ్యాషన్ డ్రెస్‌లను గమనించారు. సబ్యసాచి ముఖర్జీకి డిజైనర్‌గా అంతర్జాతీయ గుర్తింపు ఉంది. భారత్‌లో సబ్యసాచిని ‘వెడ్డింగ్స్ కింగ్’ అని కూడా పిలుస్తారు.

అనుష్కశర్మ, దీపికా పదుకొణె వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు వేలమంది వధువులకు పెళ్లి దుస్తులను సబ్యసాచి డిజైన్ చేశారు. సబ్యసాచి వధువుల కోసం సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించేలా తయారు చేసిన దుస్తులను స్ఫూర్తిగా తీసుకుని ‘యే లాల్ రంగ్’ అనే పేరుతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు విద్యార్థులు. మోడళ్లలా సన్‌గ్లాస్ పెట్టుకుని.. సిప్పర్‌తో.. ర్యాంప్ వాక్ చేశారు. ఈ మురికివాడల చిన్నారులు ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన ఈ ప్రాజెక్టు భారత్‌లో అనేకమంది హృదయాలను గెలుచుకుంది.

అతి తక్కువ డబ్బులతో, దాతలు ఇచ్చిన దుస్తులతో కలిసికట్టుగా అందరూ కలిసి రూపొందించిన ఈ వీడియోను సబ్యసాచి ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ ఎమోజీతో రీపోస్ట్ చేశారు. ఈ వీడియోపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిశాయి. సోషల్ మీడియాలో చాలామంది ఈ చిన్నారుల పనితీరును నిపుణులతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో వల్ల చారిటీ సంస్థ వారి స్కూల్ అందరి దృష్టినీ ఆకర్షిచింది. చాలా టీవీ చానళ్లు ఆ స్కూల్‌ను సందర్శించాయి. వీడియోలో నటించిన పిల్లల్లో కొందరిని తమ షోలో పాల్గొనాల్సిందిగా ప్రముఖ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు ఆహ్వానించాయి. సినీ నటి తమన్నా పిల్లల దగ్గరకు వెళ్లి పలకరించారు. ఇలాంటి స్పందనను అసలు ఊహించలేదని విద్యార్థులు అంటున్నారు.