- హైడ్రా పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
- పేదలకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి
- ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): హైడ్రా కూల్చివేతల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఏమై పోవాలి? వారి గోడు కాంగ్రెస్ సర్కారుకు పట్టదా? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైడ్రా కూల్చివేతలపై ప్రశ్నిస్తూ గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
కూల్చివేతలపై సరైన ప్రణాళిక లేకుండా హైడ్రా ఏకపక్షంగా ముందుకెళ్తున్నదని, దీనిపై పేదల ఆందోళనలను, వారి మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించడం సరికాదు అన్నారు. నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇండ్లను కూల్చివేసే మార్గాన్ని ఎంచుకున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రక్రియను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదన్నది ప్రజల అభిప్రాయమని చెప్పారు. హైడ్రాకు ఓ స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
అక్రమాలను సమర్ధించం.. కానీ
ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను తాము సమర్థించబోమని.. కానీ, వీటిపై చర్యలు తీసుకునే సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని కిషన్‌రెడ్డి సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలిసిన ఇండ్లకు ప్రభుత్వం తరపున రూ.కోట్లు ఖర్చుచేసి వేసిన రోడ్లు, వెలిగించిన వీధి లైట్లు, కల్పించిన తాగునీటి వసతులు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, చివరకు జీహెచ్‌ఎంసీ తరపున ఇంటి నెంబరును కేటాయించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల ద్వారా సేవలు అందిస్తూ పన్నులు తీసుకుంటున్నప్పుడు అక్రమం అనిపించనిది..
ఇవాళ హఠాత్తుగా అక్రమం అంటే వాళ్లు ఎక్కడకు వెళ్లాలని నిలదీశారు. వారంతా అప్పులు చేసి, బ్యాంకు రుణాలు తీసుకుని.. ప్లాట్లు, అపార్టుమెంట్లు కొనుక్కుని నివాసం ఉంటున్నారని అన్నారు. కొన్ని చోట్ల అన్ని అనుమతులున్నా నిర్మాణాలను నేలమట్టం చేయడం అన్యాయమని అన్నారు. సొంతింటి కోసం సామాన్యులు పడే కష్టాలు మర్చిపోవద్దని హితవు పలికారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు తప్పని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు.
అధికారులపై నా చర్యలు తీసుకోవాలి
మూసీ పరివాహక ప్రాంతంలో 15 వేలకు పైగా పేద, మధ్య తరగతి కుటుంబాలున్నాయని.. వారి నివాసాలను హైడ్రా ద్వారా కూల్చేముందు వారితో చర్చించాలని కిషన్‌రెడ్డి కోరారు. తప్పుడు లేఅవుట్‌లు సృష్టించి ప్రజలను మభ్య పెట్టి, పెట్టుబడులు పెట్టించి, అక్రమంగా భూములు అమ్మిన వారిని కూడా దీనికి బాధ్యులను చేస్తూ ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకు రావాలని సూచించారు. హైడ్రా దూకుడు పేదలపై చూపకుండా, బాధితులతో చర్చించాలని హితవుపలికారు.
మూసీతోపాటుగా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతల విషయంలో దుందుడుకు విధానాలతో ముందుకెళ్లకూడదని కోరారు. బ్యాంకులకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రస్తుతం ఇస్తున్న రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని కోరారు. ఇప్పటికే కూల్చివేతల నిర్ణయంతో ఆందోళనలో ఉన్న ప్రజలు.. ప్రభుత్వ అధికారుల వ్యవహారశైలితో మరింత అయోమయానికి గురవుతున్నారని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం చేయాలని సీఎంను కోరారు.