calender_icon.png 24 December, 2024 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజ తల్లి దౌర్జన్యం

13-07-2024 12:18:37 AM

  1. ప్రొబేషనరీ ఐఏఎస్‌పై రోజుకో అంశం వెలుగులోకి
  2. ట్రాఫిక్ ఉల్లంఘనలపై 21 చలాన్లు
  3. రైతులపై ఆమె తల్లి రౌడీయిజం
  4. భూమి విషయంలో తుపాకీతో బెదిరించిన వైనం
  5. కమిటీ నివేదిక వస్తేనే ఖేద్కర్‌పై చర్యలకు అవకాశం

న్యూఢిల్లీ, జూలై 12: ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రొబేషన్ పీరియడ్‌లోనే పూర్తి స్థాయి అధికారిగా ప్రవర్తించి ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఆగ్రహానికి గురై బదిలీ వేటు పడిన తర్వాత ప్రతిరోజూ ఆమె గురించి కొత్త విషయం వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఆమెపై ఉన్న ఆరోపణలు నిజమని తేలితే ఖేద్కర్ కెరియర్ చిక్కుల్లో పడనుం ది.

ఇప్పటికే అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు యూపీఎస్పీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో ఏకసభ్య కమిటీని కేంద్రం నియమిం చింది. డీవోపీటీ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేదీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. మరో రెండు వారాల్లో ఆయన నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ఆరోపణలు నిజమ ని తేలితే పూజా ఖేద్కర్‌ను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. అంతేకాకుం డా నిజాలు దాచి తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఖేద్కర్‌పై క్రిమినల్ చర్య లు తీసుకునేందుకు కూడా అవకాశముంది. 

21 ట్రాఫిక్ చలాన్లు

ఇవి మాత్రమే కాకుండా ఆమెపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక ఆరోపణలు వెలుగు చూశాయి. సొంత కారుకు ప్రభుత్వ స్టిక్కర్లు, రెడ్ బీకాన్ లైట్లు వంటి ఫిర్యాదులు ఆమెపై ఉన్నాయి. అంతేకాకుండా సీనియర్ అధికారులు లేని సమయంలో వారి చాంబర్లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపైనా వివాదం తలెత్తింది. ఇక ట్రాఫిక్ అంశానికి వస్తే ఖేద్కర్ ఆడి కారు 21 సార్లు నిబంధనలన్ని ఉల్లంఘించినట్లు ఆమెకు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. వాటిపై దాదాపు రూ.27 వేల జరిమానా చెల్లించాలని తెలిపారు. 

తుపాకీతో తల్లి బెదిరింపులు..

పూజా వివాదం కొనసాగుతుండగానే ఆమె తల్లి మనోరమ ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరిస్తున్న వీడియో బయటకు వచ్చింది. అందులో కొందరు గ్రామస్థులను ఆమె పిస్తోల్‌తో బెదిరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ భూమి విషయంలో తుపాకీ పట్టుకుని గ్రామస్థుల వద్దకు దూసుకొచ్చింది. కెమెరాను చూడగానే భూపత్రాలను చూపించండి.. నా పేర డాక్యుమెంట్లు ఉన్నాయని బెదిరించింది. దీనిపై ఆ వ్యక్తి స్పందిస్తూ పత్రాలు, కేసు కూడా కోర్టులో ఉన్నాయని జవాబిచ్చాడు. అయితే కోర్టు ఆర్డర్ చూపించమని, తనకు రూల్స్ నేర్పించవద్దని హెచ్చరించింది. రైతుల భూములను ఆక్రమించాలని యత్నించినట్లు వారి కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. వారి దౌర్జన్యాలకు రైతులు తిరుగుబాటు చేయడంతో మనోరమ మందీమార్బలంతో అక్కడికి చేరుకుని రైతులను బెదిరించారు. ఈ విషయంలో కేసు కూడా నమోదైంది.

నివేదిక వస్తేనే చర్యలకు అవకాశం

పుణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్న ఖేద్కర్.. తన ప్రైవేట్ ఆడీ కారుకు సైరన్, ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడటంతో ఈ వివాదం మొదలైంది. ఈ విషయంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అనేక అంశాలు ఆమె మెడకు చుట్టుకున్నాయి. తాజాగా ఆమె కారుపై ట్రాఫిక్ ఉల్లంఘనలు, అధికారులపై ఒత్తిడి తెచ్చి సెటిల్మెంట్లు చేసుకోవడం.. ఇలా ఒక్కొక్కటి బయటపడ్డాయి. చివరికి ఆమె సివిల్స్ అభ్యర్థిత్వంపైనా అనుమానాలు మొదలయ్యాయి. తనకు మానసిక, నేత్ర సమస్యలు ఉన్నట్లు యూపీఎస్సీకి అఫిడవిట్ ఇచ్చారు. 2022 ఏప్రిల్‌లో ఈ విషయమై ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు కొవిడ్ సాకుగా చూపి ఆమె హాజరుకాలేదు. తర్వాత ఏదో కారణం చెబుతూ తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏకసభ్య కమిటీ ఇచ్చే నివేదిక కీలకంగా మారింది. దాన్ని బట్టే ఆమెపై చర్యలు తీసుకునే అవకాశముంది.