calender_icon.png 30 October, 2024 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూజ ఐఏఎస్ రద్దు

01-08-2024 02:12:28 AM

  1. ఉద్యోగం నుంచి తొలిగించిన యూపీఎస్సీ
  2. మళ్లీ పరీక్షలు రాయకుండా జీవితకాల నిషేధం
  3. సివిల్స్ కోసం నకిలీ పత్రాలు సమర్పించినట్టు నిర్ధారణ

న్యూఢిల్లీ, జూలై 31: మహారాష్ట్రకు చెందిన ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజ ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కఠిన చర్యలు తీసుకొన్నది. ఆమె ఐఏఎస్ ఉద్యోగాన్ని రద్దుచేస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. జీవిత కాలంలో మళ్లీ సివిల్స్ పరీక్షలు రాయకుండా ఆమెపై నిషేధం విధించింది. తన అసలు వివరాలు దాచిపెట్టి నకిలీ పేర్లతో పరిమితికి మించి ఎక్కువసార్లు పరీక్ష రాసినట్టు నిర్ధారణ కావటంతో కఠిన చర్యలు తీసుకొన్నట్టు ప్రకటించింది.

సివిల్స్ పరీక్ష కోసం పూజ తప్పుడు ఓబీఈ, వైకల్య సర్టిఫికేట్లు కూడా సమర్పించినట్టు నిర్ధారణ కావటంతో జీవితకాల నిషేధం విధించారు. ‘రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆమె సీఎస్‌ఈ నిబంధనలు అతిక్రమించినట్టు తేలింది. దీంతో ఆమె సీఎస్‌ఈ ప్రొవిజనల్ క్యాండిడేచర్ నుంచి తొలగిస్తున్నాం. అంతేకాదు.. ఆమె జీవితకాలంలో మళ్లీ యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తున్నాం’ అని యూపీఎస్సీ ప్రకటించింది. 

పూజ ప్రొఫైల్ మాత్రమే తప్పు

పూజ ఖేద్కర్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో అప్రమత్తమైన యూపీఎస్సీ ఇతర అభ్యర్థులెవరైనా అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు జరిపారు. 2009 నుంచి 2023 వరకు ఐఏఎస్ ఉద్యోగాలు సాధించిన దాదాపు 15000 మంది అభ్యర్థుల వివరాలను లోతుగా పరిశీలించినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో పూజ వివరాలు మాత్రమే తప్పు అని తేలాయని, మిగతా అభ్యర్థుల వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయని తెలిపారు.  

కోరి తెచ్చుకొన్న కష్టాలు

ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిగా మహారాష్ట్రలోని పుణెలో పనిచేసిన పూజ ఖేద్కర్ కష్టాలు కోరి తెచ్చుకొన్నది. పుణెలో ప్రొబేషన్‌లో ఉన్నప్పుడు తనకు ప్రత్యేక ఆఫీస్, కారు, సిబ్బంది కావాలని అధికారులను ఆమె ఆదేశించారు. పూజ తీరును నిరసిస్తూ పుణె కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో ఆమెను ప్రభుత్వం వాసిం జిల్లాకు బదిలీ చేసింది. ఈ పరిణామంతో ఆమె అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్‌కు రూ.40 కోట్ల ఆస్తి ఉండగా, ఆమె ఐఏఎస్ ఉద్యోగం కోసం తన కుటుంబానికి పైసా ఆదాయం లేదని ఓబీసీ సర్టిఫికేట్ సమర్పించారు.