- ఉద్యోగం కోసం తప్పుడు పత్రాలు
- కోట్ల ఆస్తులు ఉన్నా కానీ క్రిమిలేయర్
- వైకల్యం అంటూ వెకిలిచేష్టలు
- పూజ తల్లిపై కూడా కేసు
- తప్పించుకు తిరుగుతున్న ఐఏఎస్ తల్లిదండ్రులు
ముంబై, జూలై 15: తన గొంతెమ్మ కోర్కెలతో ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ విషయంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు పూజ బతుకంతా ‘నకిలీ’మయం అని పలు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి యూపీఎస్సీ నుంచి రిజర్వేషన్ పొందినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కూడా తప్పుడు పత్రాలు సమర్పించి.. రిజర్వేషన్ పొందింది. రూ. 8 లక్షల లోపు కుటుంబ సంపాదన ఉన్న వ్యక్తులకే క్రిమిలేయర్ వర్తిస్తుంది.
కానీ పూజకు ఏకంగా కోట్లలో ఆస్తులు ఉన్నా కానీ ఆమెకు క్రిమిలేయర్ వర్తించింది. 2023 బ్యాచ్‌లో ఐఏఎస్ పాసైన పూజ ప్రొబెషన్ పీరియడ్‌లో ఉండగానే.. అధికారులను గొంతెమ్మ కోర్కెలు కోరి.. సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. తనకు మానసిక, నేత్ర సమస్యలు ఉన్నాయని చెప్పిన పూజ యూపీఎస్సీ నిర్వహించే మెడికల్ టెస్టులకు కూడా సరిగ్గా హాజరుకాలేదు. కానీ ఆమెకు మాత్రం ఐఏఎస్ పోస్టు లభించింది. ఐఏఎస్ అయిన తర్వాత కూడా పూజ తన ప్రవర్తనను మార్చుకోలేదు.
‘వైకల్యం’ సర్టిఫికెట్ కుదరదు..
పూజ ఖేద్కర్ 2022 ఆగస్టులో వైకల్య ధ్రవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ ఆమె దరఖాస్తును వైద్యులు తిరస్కరించారు. లోకోమోటర్ వైకల్యం కోసం పూజ దరఖాస్తు చేసుకోగా.. ఆ దరఖాస్తును తిరస్కరించారు. ఇందుకు సంబంధించిన కాపీ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనికంటే ముందు ఆమె అహ్మద్ నగర్ ఆసుపత్రి నుంచి కూడా సర్టిఫికెట్ కోసం ప్రయత్నించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇన్ని తప్పుడు సర్టిఫికెట్లు పెట్టినా కానీ యూపీఎస్సీ మాత్రం ఆమె అప్లికేషన్లను తిరస్కరించకపోవడం గమనార్హం.
పూజ తల్లిదండ్రులు పరార్!
తప్పుడు పత్రాలతో ఉద్యోగం తెచ్చుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజ ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ కూడా తక్కువేం కాదు. మహారాష్ట్రలోని ఓ గ్రామానికి సర్పంచ్ అయిన మనోరమ.. అక్కడ ఓ భూవివాదంలో గన్ చూపిస్తూ అక్కడ ఉన్న వ్యక్తులను భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆయుధాల చట్టం కింద ఆమె మీద కేసు నమోదు అయింది. ఇక పూజ ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ మహారాష్ట్ర ప్రభుత్వంలో అధికారిగా విధులు నిర్వర్తించారు.
అక్రమ ఆయుధాల విషయంలో ఫైల్ అయిన కేసు గురించి ఖేద్కర్ తల్లిదండ్రుల కోసం వెళ్లగా.. వారు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. వారిని వెతికేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా పూనే పురపాలక సంఘం కూడా ఖేద్కర్ ఇంటికి నోటీసులు జారీ చేసింది. ఖేద్కర్ దంపతుల ఇంటికి ఆనుకుని ఉన్న అనధికార నిర్మాణాలను వారంలో తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది.