calender_icon.png 9 February, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అచ్చతెలుగు తీపిని రుచి చూపించిన పొన్నికంటి తెలగన్న

27-01-2025 12:00:00 AM

“అచ్చతెనుంగు బద్దె మొకటైనను గబ్బములోన నుండినన్

హెచ్చని యాడుచు నుందురదియెన్నుచు నేర్పుగ బొత్తమెల్ల ని

ట్లచ్చ తెనుంగున న్నొడవ 

నందుల చందమెరుంగువారు నిన్

మెచ్చరొ, యబ్బురంబనరొ, 

మేలనరో కొనియాడరో నినున్‌”

అంటూ తొలి అచ్చ తెలుగు కావ్యం గా కీర్తి పొందిన కావ్యం ‘యయాతి చరిత్రము’ను రచించిన పొన్నికంటి తెలగన్న తన ప్రయత్నపు గొప్పదనాన్ని గురించి చెప్పుకున్నాడు ఈ పద్యంలో. అచ్చ తెనుగులో ఒక కావ్యమే రాయడమనేది ఘనంగా సాహిత్రీపియుల ప్రశంసకు పాత్రమవుతుందనీ ఆయన వివరించాడు.

అచ్చ తెనుగులో ఒక పద్యం చెప్పడమే కష్టమైనప్పుడు ప్రత్యేకంగా పూనుకొని ఒక అచ్చ తెనుగు కావ్యాన్నే నిర్మించిన ప్రముఖ కవి పొన్నికంటి తెలగన్న గోల్కొండ సుల్తానుల కాలంలో జీవించాడు.

అమీన్ ఖాన్‌కు అంకితం

గోల్కొండను ప్రజారంజకంగా పాలి స్తూ ‘ఇభరాము’నిగా ప్రజలచే గౌరవాన్ని అందుకున్న ‘మల్కిభరామ్’ అనే ‘ఇబ్రహీం కుతుబ్ షా’ ఆస్థానంలోని వజీర్ (మీర్ జుమ్లా) అయిన ‘అమీను ఖాను’ కోరికపై తెలగన్న ఈ కావ్యరచన చేసి ఆయనకే అంకితమిచ్చాడు.

ఆ కాలం వాడే అయిన అద్దంకి గంగాధర కవి తాను రచించిన ‘తపతీ సంవరణోపాఖ్యానము’ను సుల్తానుకే అంకితమిస్తే, పొన్నికంటి తెలగన్న తాను రచించిన ‘యయాతి చరిత్రము’ను గోల్కొండ సుల్తాను ఆస్థానంలోని ఉద్యోగియైన అమీన్ ఖాన్‌కు అంకితమిచ్చాడు. నాటి గోల్కొండ సుల్తానులు తెలుగు సంస్కృతికి, తెలుగు కవులకు గొప్ప గౌరవాన్ని ఇచ్చినట్లు చరిత్ర నిర్ధారిస్తున్నది. 

‘అచ్చతెనుగు’ అంటే?

పొన్నికంటి తెలగన్న రచించే నాటికే (1550-1580) తెలుగు సాహిత్యం గర్వించదగ్గ మహా కావ్యాలు, ప్రబంధాలు వెలువడి విస్తృత ప్రచారాన్ని పొందాయి. అందుకే, అన్ని రచనలకు భిన్నంగా తన కావ్యం ఉండాలనుకున్న తెలగన్న అచ్చ తెనుగులో ప్రబంధం నిర్మించాలని సంకల్పించాడు.

అసలు అచ్చ తెనుగంటే ఏమిటి? ఈ విషయంలో భాషావేత్తలు చర్చించి అచ్చ తెనుగు తత్సమ పద రహితంగా ఉండాలని, తద్భవాలు కాని, దేశ్యాలు కాని, అన్యదేశ్యాలు కాని ఉండవచ్చునన్నారు. అయితే, ఇందులో చిన్న ఇబ్బందికూడా ఉంది. కావ్యంలోని వ్యక్తుల పేర్లు కాని, నగరాల పేర్లుగాని ఉన్నప్పుడు చెబితే అర్థం కాకపోయే ప్రమాదం ఉంది. అందుకే, వాటి వరకు కవులకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. 

ఆ విషయాన్ని తెలగన్నయే తన కావ్యంలో

“తెనుగునకు మారు పేళ్లిడి

పెనచిన వినగూడదనుచు 

బిరుదులు బేళ్లున్

మునువేల్పు బాన వెంబడి

నునిచెద గాదనుకుడయ్య 

యుల్లము లందున్‌”

అంటూ, చెప్పుకున్నా అవకాశం ఉన్నచోట్ల మాత్రం మార్చి చెప్పాడు. శ్రీమహావిష్ణువును ‘కరిదేవర’ అని, పరమశివుని ‘బేసికంటి దేవర’ అని చెప్పాడు. అదే విధంగా వాయుపుత్రుడైన హనుమంతుణ్ణి ‘గాలిచూలు’ అని, చాతక పక్షులను చిన్కుం గూటి పులుగులు అని, సింహాసనాన్ని ‘సింగంపు గద్దె’ అని ‘యయాతి చరిత్రము’లో ప్రయోగించాడు తెలగన్న.

అష్టాదశ వర్ణనలు

పొన్నికంటి తెలగన్న పూర్వ ప్రబంధాలను బాగా అధ్యయనం చేసినవాడు కనుక ఎక్కడా ఆయన ప్రబంధ లక్షణాలను విస్మరించలేదు. ఇతర  ప్రబంధాల్లో వలెనే పురవర్ణన, ఋతువర్ణన, వనవిహార వర్ణన, జలక్రీడ వర్ణన, విరహవర్ణన వంటి అష్టాదశ వర్ణనలు ‘యయాతి చరిత్రము’లోకూడా కనిపిస్తాయి. కొన్నికొన్ని చోట్ల వర్ణనల్లో కొత్తదనం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అచ్చతెనుగులో చేసిన వర్ణనలు కావడం కూడా కొత్తదిగా కనిపిస్తుంది. పురవర్ణనలో ఒకచోట

“అగడితలో కెందామర

మొగడలు గనుపట్టె జాల 

మూకై చూడం

దగి మున్నీటం దేలుచు

బెగడని వార్వంపుటగ్గి పిల్లలు బోలెన్‌”

అన్న పద్యం రాశాడు. నగరం చుట్టూ ఉన్న అగడ్తలోని ఎఱ్ఱతామరలు అగ్గిపిల్లల్లాగా ఉన్నాయంటూ వర్ణించాడు. 

‘యయాతి చరిత్రము’ 

కథకు మూలం మహాభారతం

ఈ వర్ణనలే కాక కొత్త కొత్త ఉపమానాలు కావ్యమంతా విస్తరించి ఉన్నాయి. ఇవి తెలగన్న ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ‘యయాతి చరిత్రము’లోని 737 గద్య పద్యాల్లో విస్తరించిన కథకు మూలం మహాభారతం. అయితే, మూలంలోని ‘యయాతి చరిత్ర’ను సవిస్తరంగా కాకుండా కొంత వదిలి పెట్టినట్లు గమనించవచ్చు.

మూలంలో శుక్రుడు ఇచ్చే శాప వృత్తాంతాన్ని, మరికొన్ని వృత్తాంతాలను వదలి పెట్టి దేవయాని పుత్రులైన యదువు, తుర్వసుల కథను, శర్మిష్ఠ సంతానమైన ద్రుహ్య, వసు, పూరువుల వృత్తాంతాలను గ్రహించి తన కావ్యంలో రచించా డు తెలగన్న.

ఇంత గొప్పకథను మొట్టమొదటిసారి అచ్చతెనుగు కావ్యంగా నిబద్ధించాడు గనుకనే కృతిభర్త అయిన అమీన్ ఖానుని ప్రశంస అందుకున్నట్లుగా చెప్పిన ఈ కింది పద్యంలోని ప్రత్యక్షరమూ సత్యమే.

“మున్నెవ్వరు నొడువని యీ

తెన్నిడి కడుమీరి యచ్చతెనుగు గబ్బం

బెన్నిక మీరగ జెప్పిన

నిన్నుం బొగడంగ గలడె 

నెలతాల్పయినన్‌”

అన్న పద్యాన్నిబట్టి తెలగన్న ప్రతిభ, నూత్న ప్రయోగ దృష్టి వంటి విషయాలు ఆయనను తెలుగు సాహితీ ప్రపంచాన స్థిర తార గా వెలిగింపజేశాయి. అంతకు పూర్వపు శివకవులు చెప్పిన మాట ‘జాను తెనుగు’లో రచించినా వారి కృతులు తత్సమపద బాహుళ్యం కలిగినవిగా కనిపిస్తున్నాయి. కానీ, తెలగన్న రచన మాత్రం పూర్తిగా అచ్చతెనుగు కావ్యంగానే నిలిచింది. ఇ ది కవి ప్రతిభ, భాషపై అధికా రం అనడం అతిశయోక్తి కాదు.

పాలకుల అభిమానం

గోలకొండ సుల్తానుల కాలం వాడే అయిన అద్దంకి గంగాధర కవికూడా మహాభారత కథలోని తపతి, సంవరణుల వృత్తాంతాన్ని వస్తువుగా గ్రహించి ‘తపతీ సంవరణోపాఖ్యానము’ అనే కావ్యాన్ని రచించి, తమ సుల్తానుకే అంకితం చేశాడు. పొన్నికంటి తెలగన్న కూడా మహాభారత అంతర్గతమైన య యాతి కథను వస్తువుగా గ్రహించి ‘యయాతి చరిత్రము’ను రచించి సుల్తాను ఆస్థానంలో వజీరు (మీర్ జుమ్లా) బాధ్యతలను నిర్వహిస్తున్న అమీన్ ఖాన్‌కు అంకితం చేయడం ఒక విశేషం.

నాటి గోలకొండ పాలకులు, వారి ఉద్యోగులు కూడా తెలుగు భాషపట్ల ఎనలేని అనురాగాన్ని చూపించినట్లు అర్థమవుతున్న ది. ఇంకా ఆ కాలంలో వెలువడ్డ మరికొన్ని కావ్యాల ద్వారా కుతుబ్ షాహీ పాలకుల తెలుగు సాహిత్యసేవ ఎంతటిదో అవగతమవుతున్నది.

సాధారణంగా కావ్య ప్రారంభంలో కృతి పతి వంశవర్ణన చెయ్యడం కావ్య మర్యాదగా ప్రాచీన తెలుగుకవులు భా వించి రచించారు. ఆ సంప్రదాయాన్నే పొన్నికంటి తెలగన్న కూడా ఈ కావ్యంలోనూ పాటించాడు. తన కృతి భర్త అయిన వజీరు అమీన్ ఖాన్ కుటుంబాన్ని, అతని వదాన్యతను, అతని భాషాభిమానాన్ని విపులంగానే చెప్పే ప్రయత్నం చేశాడు.

తెలగన్న కావ్యాన్ని అంకితం తీసుకున్న అమీన్ ఖాన్ అప్పటి గోల్కొండ నవాబు కొలువులో వజీరుగా బాధ్యతల్ని నిర్వహిస్తూ కూడా తన పరిధిలో ఎన్నెన్నో ప్రజోపయోగకరమైన కార్యక్రమాలను నిర్వహించే వాడు. ఎందరో పేద బ్రాహ్మణుల ఇళ్ల లో జరిగే పెళ్ళిళ్లను తామే నిర్వహించే వాడు. 

పెద్ద భార్యపై ప్రశంసా కవిత్వం

కావ్య నాయకుడైన యయాతి మహారాజుకు ఇద్దరు భార్యలు. కృతి భర్త అమీన్ ఖాన్ భార్యలు ముగ్గురు. వాళ్లు కూడా భర్త చేసే ధార్మిక కార్యక్రమాలకు తమ వంతు తోడ్పాటును అందించే వారని అవతారికలో కవి విపులంగా తెలిపాడు. అమీన్ ఖాన్ పెద్ద భార్య ‘బడే బీబీ’. ఆమెను గురించి, ఆమె సేవాగుణాన్ని గురించి-

“అత్తగారిండ్లకు నరుగు కన్నియలకు

కట్నంబు లిచ్చుచు గారవించు

బ్రొద్దుబ్రొద్దుననె యెప్పుడు లేచి

వాడల పసిబిడ్డలకు నెల్ల బాలుపోయు

నాకొన్న వారల కద్దమరేయైన

నారగించగ బెట్టునరసి యరసి

పాలు నీరెనసిన బాగున బెనిమిటి

తలపులో మెలవకు మెలగ నేర్చు

నౌర, తన పుట్టినింటికి నత్తవారి 

యింటికిని వన్నెదెచ్చిన తుంటవిల్తు

తల్లివంటి బడే బీబి దరమెబొగడ

దమ్మిపూవింట నెలకొన్న దంటకైన”

అంటూ చెప్పిన పద్యం ఆమె ఘనతను, ఆమెలోని మాతృత్వ భావనను, ఆమె దయాగుణాన్ని, వేనోళ్ల కీర్తించింది. అంతేగాక, ఊళ్లోని బాలెంతలకు ఉచితంగా పాల సరఫరా చేయడం, బ్రాహ్మణ వధువులకు పెళ్ళిళ్లు తమ ఖర్చుతో చెయ్యడం, బ్రహ్మచారులైన వారికి వివాహాలు చేయించి గృహస్థులుగా స్థిరపరచడం కూడా ఆమె చేసేదని పేర్కొంటూ మరో చమత్కారాన్ని కవి జోడించాడు. 

ఊరి బయటకు హనుమంతుడు!

హనుమంతుని ఆలయం ఊరి బయట ఉండటానికి కారణం, ఈమె ‘ఆ బ్రహ్మచారిని పట్టుకొని ఎక్కడ పెళ్లి చేస్తుందోనని ఆందోళన పడి ఆయన ఊరి బయటకు చేరాడని’ చమత్కరించాడు. ఈ ఊహ బడే బీబి ఘనతకు నిదర్శనంగా నిలుస్తుంది.

కవి తన కృతి భర్త కుటుంబాన్ని గురించి వివరిస్తూ  ఆయన రెండో భార్య ‘సెక్కెర బీబీ’, ‘చుట్టముల పాలిటి తంగేటి జున్ను’గా వర్ణించాడు. మూడో భార్య ‘సెమ్మె బీబీ’ అనే పేరున్న మహిళ. ఈ ముగ్గురు భార్యలకు అయిదుగురు సంతానమని పేర్కొని, రెండో కుమారుడైన ఫాజిల్ ఖాన్ శ్రీరంగరాయలతో రాయబారం నడిపినట్లు కూడా తెలిపాడు. ఆ ప్రసక్తి వల్లనే ఈ రచన 1576-1580 మధ్య కాలంలో జరిగి ఉండవచ్చునని సాహిత్య చరిత్రకారులు భావించారు.

నూటొక్క పద్యాలతో రామకథ

‘యయాతి చరిత్రము’లో రామకథ కూడా 101 పద్యాల్లో చోటు చేసుకోవడం విశేషం. ఈయన తిక్కనను, రాధా మాధవ కవిని కూడా కొన్నికొన్ని చోట్ల అనురించినట్లు విమర్శకులు అనేక ప్రమాణాలతో తేల్చి చెప్పారు. “ఈ తెలగన్న ‘యయాతి చరిత్రము’ అచ్చ తెనుగు కావ్యములకు ఆదర్శప్రాయమేగాక, అగ్రేసరమైంది.

అది ఒజ్జబంతియేగాక మేలుబంతి” అన్న కొర్లపాటి శ్రీరామమూర్తి మాటలు అక్షరసత్యాలు. అందుకే, ఆరుద్ర ఈ అచ్చతెనుగు కవిని గురించి “తెలగన్న అచ్చంగా తెలుగన్నయే” అన్నాడు.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448