20-03-2025 12:21:18 AM
బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శంకర్
హుస్నాబాద్, మార్చి19 : మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు పారాచూట్ లీడర్ గా వచ్చారని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. ఆయన హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి పోతారని, ఆయన వల్ల ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగదన్నారు. బుధవారం ఆయన హుస్నాబాద్ లో పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ ను డెవలప్ చేయాలనే ఉద్దేశమే లేదన్నారు. ఆయన లక్ష్యాలు వేరే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ద్వారా హుస్నాబాద్ అభివృద్ధికి పాటుపడలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులను తామే ఇప్పించామని పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటున్నారని విమర్శించారు.
‘ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావడం లేదు. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం ఇది,‘ అని ఆయన దుయ్యబట్టారు. హుస్నాబాద్లో అభివృద్ధి శూన్యమని, కరీంనగర్ నుంచి పారాచూట్ లీడర్గా వచ్చిన పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
హుస్నాబాద్ అసెంబ్లీని కరీంనగర్లో కలపాలన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మూడు రెవెన్యూ జిల్లాల్లో ఉన్న హుస్నాబాద్ ప్రజలకు ఎవరితోనూ సంబంధం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, హుస్నాబాద్ మండల, పట్టణ, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల అధ్యక్షులు భూక్య సంపత్, దొడ్డి శ్రీనివాస్, రామంచ మహేందర్ రెడ్డి, రమేశ్, సంతోష్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.