calender_icon.png 24 September, 2024 | 9:56 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు పొంగులేటి మధ్యవర్తిత్వం

24-09-2024 12:38:39 AM

కేసీ వేణుగోపాలతో హరీశ్, కేటీఆర్ ఒప్పందాలు 

ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని, ఇందుకు మంత్రి పొంగులేటి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అందుకే గత ప్రభుత్వ తప్పిదాలపై సీబీఐ ఎంక్వురై కోరడం లేదన్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. రాష్ర్టం కోరితే 24 గంటల్లోనే సీబీఐ ఎంటరవుతుందున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు తరుచూ ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్‌తో ఒప్పందాలు చేసుకున్నారని ఏలేటి ఆరోపించారు. సీఎం రేవంత్ ఈ వ్యవహారానికి అంగీకారం తెలపకపోవడంతో పొంగులేటి మధ్యవర్తిత్వం వహించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

9 నెలల నుంచి రాష్ర్ట ప్రభుత్వంపైనా, గత ప్రభుత్వం చేసిన ఎన్నో తప్పిదాల పైనా బీజేపీ పోరాడిందన్నారు. కాంగ్రెస్ అవినీతిపై బీఆర్‌ఎస్ నేతలు ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ డ్రామాలో భాగంగానే సవాళ్లు చేసుకుంటున్నారు.