12-04-2025 12:10:18 AM
*రంగారెడ్డి జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 11: సిటీ శివారులో ఉన్న చెరువులను అధికారులు రక్షించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కబ్జాకు గురవుతున్న చెరువు, కాల్వలను కాపాడి హద్దులు నాటాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య, సీనియర్ నాయకులు ఏర్పుల నరసింహ డిమాండ్ చేశారు.
కబ్జాకు గురవుతున్న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం అనాజ్ పూర్ గ్రామంలో ఉన్న వేముల కత్వ, ఇంద్రమ్మ సాగర్ లను శుక్రవారం జిల్లా నాయకులు పరిశీలించారు. రెండు చెరువులలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో భారీగా రోడ్లు వేస్తున్నట్లు గుర్తించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు, కత్వలను,కబ్జా దార్ల నుండి రక్షించడంలో రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని అన్నారు.
జీనియస్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 300 ఎకరాల భూమిని చదును చేస్తూ అందులో విలాస్ నిర్మించాలని చూస్తున్నారని ఈ డెవలప్మెంట్ పనులకి నాలా కన్వెన్షన్ గాని, హెచ్‌ఎండిఏ పర్మిషన్ గాని, మైనింగ్, ఇరిగేషన్ అధికారుల నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా పెద్ద పెద్ద గుట్టల్ని బ్లాస్టింగ్ చేస్తూ , గ్రామస్తులకు పెద్ద పెద్ద ధ్వనులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
ఆ గ్రామానికి జీవన ఆధారమైన ఇందిరామ్మసాగర్, పైన ఉన్న వేముల కత్వాను ఇప్పటికే ఒకపక్క ఫిలిం సిటీ యాజమాన్యం ఎఫ్ టి ఎల్ నుండి భారీ భారీ గోడ నిర్మించిందన్నారు. ఇప్పుడు చదును చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో గుట్టలను పగలదీసి పెద్ద పెద్ద రాళ్లతో చెరువులో పోసి నిబంధనలకు వ్యతిరేకంగా భారీ రోడ్డు వేస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు తెలిసి కూడా ఏమి చేయకుండా మామూళ్లకు ఆశపడి చెరువుకుంటలని కబ్జా చేస్తున్నారన్నారు.
ఇలా విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్నారని వారిపై మౌనంగా ఉంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఎంత దూరం వెళ్లాడానికైనా తాము సిద్దమన్నారు. లేనిచో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా నాయకులు ముత్యాలు, కావలి జంగయ్య, గుండె శివకుమార్ ,మహేశ్వరం లింగస్వామి, పి శ్రీనివాస్, గ్రామ రైతులు వెంకటేష్, మహేష్, బాల్ రాజ్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.