calender_icon.png 23 October, 2024 | 9:52 PM

చెరువుల జోలికొస్తే జైలే

12-09-2024 12:53:18 AM

  • వాటిని ఆక్రమించిన వారి వెన్నులో వణుకు పుట్టాలి
  • స్వచ్ఛందంగా కూల్చివేతలకు ముందుకు రావాలి
  • గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీలో అన్నీ లీకేజీలే 
  • పోలీసుల పిల్లల కోసం 50 ఎకరాల్లో రెసిడెన్సియల్ స్కూల్
  • నిరుద్యోగులకు భరోసా కలిగేలా జాబ్ క్యాలెండర్ 
  • 18 వేల కోట్లతో రుణమాఫీ చేశాం
  • పోలీస్ అకాడమీలో ఎస్‌ఐల పాసింగ్ ఔట్ పరేడ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి

* నగర దాహార్తిని తీర్చే హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాల చుట్టూ కొందరు శ్రీమంతులు ఫాంహౌస్‌లు కట్టుకొని వారి డ్రైనేజీలను ఈ చెరువుల్లో కలుపుతున్నారు. ఆ నీటినే ప్రజలకు సరఫరా చేస్తే ముఖ్యమంత్రిగా నేను విఫలమైనట్టే. చెరువులు, కుంటల ఆక్రమణతోనే నగరంలో వరదలు వచ్చాయి. వాటిని పూర్తిగా తొలగించి మూసీ నదిని ఒక ప్రణాళికతో ప్రక్షాలన చేస్తాం. 

 సీఎం రేవంత్‌రెడ్డి

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 11: చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్ పరిధిలోని భవనాల కూల్చివేత తన బాధ్యత అని, ఎవరైనా చెరువుల జోలికి వస్తే ఇక జైలేనని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఎస్‌ఐల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ ఏడాదిలోనే 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు.

యువత తమ తల్లిదండ్రుల ఆకాం క్షలను నెరవేర్చే విధంగా సక్రమ దారిలో నడవాలని సూచించారు. నిరుద్యోగుల ఆశలను నెరవేర్చేలా జాబ్ క్యాలెండర్ ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీలో అన్నీ లీకేజీలే జరిగాయని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు. తాము వరుసగా నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు విజ్ఞప్తి చేయడంతోనే గ్రూప్ వాయిదా వేసినట్లు వివరించారు. త్యాగాలతో సాధించు కున్న తెలంగాణలో వ్యసనాలకు తావు లేదని స్పష్టం చేశారు. కులవృత్తులతో పాటు చేతివృత్తులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అనేలా చేస్తున్నామని, ఇందులో భాగంగా రుణమాఫీ చేసి అన్నదాత కళ్లలో ఆనందం చూశామని అన్నారు. 

ఆక్రమణదారులు స్వతహాగా ముందుకు రండి 

చెరువులు, కుంటలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్ పరిధిలో ఫాంహౌస్‌లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన వారు స్వతహాగా ముందుకు వచ్చి వాటిని కూల్చివేయాల ని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కబ్జాదారులు ఆక్రమణలు విడిచి వెళ్లాలని, లేదం టే నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశ యాలు గతంలో నగరవాసుల దాహార్తి తీర్చాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు.

ఈ చెరువులు కబ్జాకు గురయ్యాయని, అందులో కొందరు ఫాంహౌస్‌లు నిర్మించుకొని అందులో నుంచి డ్రైనేజీని చెరువుల్లోకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాదారుల చెర నుంచి విడిపించడమే హైడ్రా టాస్క్ అని ప్రకటించారు. చెరువులను ఆక్రమించింది ఎంతటివారైనా వదిలేది లేదని హెచ్చరించారు. చెరువులను ఆక్రమిస్తే చెరసాల తప్పదని తేల్చి చెప్పారు. కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్నా న్యాయపోరాటం చేసి తొలగించడం ఖాయమని తెలిపారు. 

రైతుల కళ్లలో ఆనందం

రూ.18 వేల కోట్లతో రుణమాఫీ చేశామ ని, రైతుల కళ్లలో ఆనందం చూడటమే సర్కా రు లక్ష్యమని సీఎం తెలిపారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని, వారి కష్టాలు తనకు పూర్తిగా తెలుసని అన్నారు. సంస్కరణల కోసమే కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని అప్పగించినట్లు తెలిపారు. పోలీసులంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా పరేడ్ కమాండర్‌గా మహిళా ఎస్‌ఐ పల్లి భాగ్యశ్రీ వ్యవహరించగా ఆమెను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీ స్ అకాడమీలో మొత్తం 547 మంది ఎస్‌ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 

సీఎం ఆటవిడుపు

ఎస్‌ఐల పాసింగ్ పరేడ్ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్ అకాడమీలో క్రీడా భవన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన ఇండోర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి కొంతసేపు ఉత్సాహం గా షటిల్ ఆడారు.

ఎస్‌ఐల పాత్ర కీలకం: డీజీపీ

శాంతిభద్రతల పరిరక్షణ, జనానికి న్యా యం చేయడంలో ఎస్‌ఐల పాత్ర ఎంతో కీలకమని డీజీపీ జితేందర్ అన్నారు. నేరాలు జరగకుండా చూడటంతో పాటు మారుతు న్న టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవు తూ ముందుకు సాగాలని సూచించారు. సైబర్ నేరాల నివారణలో తెలంగాణ పోలీసులకు ప్రతిష్ఠాత్మక అవార్డు రావడంతో ఎంతో సంతోషంగా ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. 

పోలీసులపై సంపూర్ణ విశ్వాసం

ప్రజలకు పోలీసులపై సంపూర్ణ విశ్వా సం ఉందని, ఏ సమస్య వచ్చినా ముందు వచ్చి పరిష్కరించేది పోలీసులేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పోలీసులు గంజా యి, డ్రగ్స్‌ను కూకటి వేళ్లతో పెకిలించి ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. హోంగార్డు నుంచి డీజీపీ వరకు వారి పిల్ల ల చదువు కోసం 50 ఎకరాల్లో అన్ని వసతులతో రెసిడెన్సియల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందుకు సంబంధిం చి సభావేదిక పైనుంచే సీఎం డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగాలు పొందిన యువత శిక్షణ పూర్తయిన తర్వాత డ్రగ్స్, గంజాయి నిర్మూళనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాటి నిర్మూళనకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు. 

వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు 

చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించిన వారి భవనాలను కూల్చివేస్తుం టే రేవంత్‌రెడ్డికి ఏమొచ్చింది కూల్చుతున్నడు అని కొందరు అంటున్నారని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. నగర దాహార్తిని తీర్చే హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాల చుట్టూ కొంద రు శ్రీమంతులు ఫాంహౌస్‌లు కట్టుకొని వారి డ్రైనేజీలను ఈ చెరువుల్లో కలుపుతున్నారని, ఆ నీటినే తాను ప్రజలకు సరఫరా చేస్తే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టేనని అన్నారు. చెరువులు, కుంటల ఆక్రమణతోనే నగరంలో వరదలు వచ్చాయని తెలిపారు.

వాటిని పూర్తిగా తొలగించి మూసీ నదిని ఒక ప్రణాళికతో ప్రక్షాలన చేస్తామని పేర్కొన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని శాశ్వ త నిర్మాణదారుల పట్ల సర్కారు సహృదయంతో వ్యవహరిస్తుందని, వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. 11 వేల మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని తెలిపారు. కేం ద్ర సర్కారు సహకారంతో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి అక్కడ పేదలు వ్యాపారాలు చేసుకునే లా అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, నాలాల ను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే, వాటిని ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజ్ చేయబోమని స్పష్టం చేశారు.