calender_icon.png 28 September, 2024 | 4:54 AM

ఇళ్లలోకి చెరువు నీరు.. స్థానికుల బేజారు

27-09-2024 02:40:05 AM

  1. ఎస్‌ఎన్‌డీపీ నాలాల జాంతో లోతట్టు ప్రాంతాల్లోకి పెద్దచెరువు నీరు
  2. ఇబ్బందులు పడుతున్న స్థానికులు

మహేశ్వరం,సెప్టెంబర్ 26(విజయక్రాంతి): మీర్‌పేట పెద్ద చెరువు సుందరీ కరణ పనుల కారణంగా చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ శాఖ మంజూరు చేసిన నిధులతో రాంకీ సంస్థ ఇటీవల చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించింది. అయితే చెరువును నింపడానికి చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ నాలా నుంచి చెరువులో ఉన్న నీరు భారీగా బయటకు వెళ్లిపోతోంది. ఆ నీరంతా చెరువుకట్ట వెనుక భాగంలో ఉన్న ట్రంక్ లైన్ ద్వారా లోతట్టు ప్రాంతాల నుంచి నేరుగా మంత్రాల చెరువులోకి చేరుకుంటోంది. ఇలానే మంత్రాల చెరువు నుంచి చందన చెరువుకు చేరుతుంది.

వారం రోజులుగా భారీగా చెరువునీరు బయటకు రావడంతో ఒక్కసారిగా ఎస్‌ఎన్‌డీపీ నాలాలు పూర్తిగా జాం ఏర్పడింది. దీనికితోడు భారీ వర్షాలు కూడా కురుస్తుండటంతో బుధవారం రాత్రి నుంచి మంత్రాల చెరువులో నుంచి నీరు భారీగా లోతట్టు ప్రాంతాలైన మిథిలా నగర్, సత్యసాయి నగర్‌ను ముంచెత్తాయి. ఇళ్లలోకి మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇదే విషయమై వారం రోజుల క్రితం విజయక్రాంతి దినపత్రిక.. ‘ఖాళీ అవుతున్న మీర్‌పేట్ పెద్దచెరువు’ అని కథనం ప్రచురించింది. అధికారులు మాకు ఈ విషయం ముందే చెబితే మేము.. తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వారమని స్థానికులు వాపోయారు. వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.