22-12-2024 01:16:46 AM
* పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపేస్తాం
* ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): హైడ్రాతో హైదరాబాద్ నగరంలో చెరువులను పునరుద్ధరించడంతోపాటు అక్రమ కట్టడాలను తొలగిస్తామని.. పేదల ఇళ్ల కూల్చివేతలను నిలిపివేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల రక్షణకు హైడ్రా ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామన్నారు. శనివారం శాసనమండలిలో హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ సవరణ బిల్లు, తెలంగాణ పురపాలక సవరణ చట్టం బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సభ్యులు సత్యవతి రాథోడ్, తాతా మధు, రమణ, జీవన్‌రెడ్డి, వెంకట్, వాణిదేవి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. హైడ్రాతో పేదలకు నష్టం జరుగుతుందనే అపోహాలను బీఆర్‌ఎస్ నేతలు సృష్టించవద్దని, భవిష్యత్తు తరాల కోసం చెరువులను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలన్నీ ఆక్రమణలు ఉన్నచోటనే జరిగాయని స్పష్టం చేశారు. హైడ్రాకు ప్రత్యేక అధికారిని నియమిస్తే త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటామనే ఉద్దేశంతో ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేసినట్టు మంత్రి వివరించారు.
అదేవిధంగా శివారు మున్సిపాలిటీలు, 51 గ్రామాల విలీనం విషయాన్ని పరిశీలిస్తున్నామని, ఏ వర్గాలకూ ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. వాటిలో అన్ని రకాల సౌకర్యాలు, రోడ్లు, కారిడార్లు, పార్కులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం రెండు బిల్లులు మండలిలో ఆమోదం పొందాయి.