ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అధికారుల నిర్లక్ష్యం
గ్రేటర్ పరిధిలో 185 చెరువులుండగా 55 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై కొనుగోలుదారుల ఆరా
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 6 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చెరువుల ఆక్రమణల అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇటీవల ఏర్పా టుచేసిన హైదరాబాద్ డిజాస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నిర్ధేశిత మార్గదర్శకాలు విడుదల చేయకుండానే చెరు వులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై కొరడా ఝులిపించడం హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను
కూల్చేయడం, కేటీఆర్ నివాసముండే జన్వాడ ఫాంహౌస్ వద్ద అధికారులు సర్వే నిర్వహించడం తెలిసిందే. దీంతో చెరువుల సమీపంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను, స్థలాలను కొత్తగా కొనుగోలు చేయదలుచుకున్నవారు తాము కొనుగోలు చేసే ప్రాపర్టీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వస్తుందా.. లేదా అనే విషయమై తెలిసిన వారి ద్వారా అధికారుల నుంచి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చెరువుల ఆక్రమణలకు గురవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
అవినీతి సొమ్ము కోసమే జాప్యమా!
జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 185 చెరువులున్నాయి. ఈ చెరువులు ఆక్రమణలకు గురికాకుండా.. వీటికి ఫుల్ ట్యాక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు మొత్తం చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లను జారీ చేశారు. మరో 45 రోజుల తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ చెరువుల సమీపంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఫైనల్ చేయాల్సి ఉంది. కానీ, ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసిన 185 చెరువుల్లో కేవలం 55 చెరువులకు మాత్రమే అధికారులు ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇంకా 130 చెరువులకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సిఉంది. అయితే ఇప్పటికే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన 55 చెరువుల వద్ద ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించి వాటిని రక్షించడంలోనూ జీహెచ్‌ఎంసీ అలసత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. చెరువుల సమీపంలో నిర్మాణదారులతో అవినీతి, అక్రమాలకు పాల్పడేందుకే జోన్ల నిర్ధారణలో జాప్యం చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. నిజంగా జీహెచ్‌ఎంసీ అధికారులే తమ పరిధిలోని చెరువుల విషయంలో కఠిన చర్యలు చేపట్టి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను తేల్చినట్లుతై ఆక్రమణలు జరిగేవి కావనే భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై ఆరా..
హైడ్రా ఆవిర్భావం తర్వాత చెరువుల ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా, భవిష్యత్‌లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా హెచ్చరించింది. ఇటీవల చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యవహారంలో సహకరించిన అధికారులపై కూడా హైడ్రా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో చెరువుల సమీపంలోని ఫ్లాట్స్, స్థలాలను కొనుగోలు చేసేందుకు సంబంధిత ప్రాపర్టీ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉందా.. లేదా అనే విషయంపై కొనుగోలుదారులు ఆరా తీస్తున్నారు.
హైడ్రా కమిషనర్‌గా వ్యవహస్తున్న ఏవీ రంగనాథ్ వద్దకే వస్తూ వారి సందేహాలను తీర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది కొనుగోలుదారులు తహసీల్దార్లు, సంబంధిత అధికారులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన ఉన్న వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో ఎక్కడైనా స్థలాలు, ఫ్లాట్స్ కొనుగోలు చేయడానికి హైడ్రా ముందు హైడ్రా తర్వాత అన్నట్లుగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై ప్రజల్లో అవగాహన కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.