రాజధానిని కమ్మేసిన పొగమంచు
దీపావళి టపాకులతో మరింత తీవ్రం
న్యూఢిల్లీ, నవంబర్ 1: దీపావళి వేళ ఢిల్లీలో కాలుష్యం కోరలు విప్పింది. శుక్రవారం ఉదయం భారీస్థాయిలో పొగమంచు దేశ రాజధానిని కమ్మేసింది. నగరవ్యాప్తంగా పటాకులపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఢిల్లీవాసులు లెక్క చేయలేదు. దీపావళి రోజున రాజధాని అంతటా పటాకుల మోత మోగింది. దీంతో ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతోన్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది. శుక్రవారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 395గా నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఇదే తరహా సూచీలు నమోదయ్యాయి. ఈ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని నోయిడా, గురుగ్రామ్‌లో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. పొగమంచు కారణంగా రోడ్లపై విజిబులిటీ తగ్గింది.
ఢిల్లీ చుట్టుపక్కన ఉన్న పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం, యూపీ నుంచి డీజిల్ వాహనాల తాకిడి వల్ల ఢిల్లీ కాలుష్యం శీతకాలంలో భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో పటాకులపై అక్కడి ప్రభుత్వం నిషేధాన్ని విధించింది.