- ఈవీలతో జీవిత ప్రమాణాలు పెంపు
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): కాలుష్య సంక్షోభాన్ని నివారించేందుకు తెలంగాణ సమాజమంతా ఒక్కటవ్వాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలు జీవిత ప్రమాణాలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
శనివారం రాజ్‌భవన్ రోడ్‌లో ఎలక్ట్రానిక్ మోటార్ షో రూమ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న వాహనాలతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారని అన్నారు. గ్రీన్ మొబిలిటీకి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని చెప్పారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.
పచ్చదనానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉంచగలిగితే అంతకు మించి ప్రజాప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాప్ ఇకో మోటార్స్ సీఈవో లెఫ్టినెంట్ ఆర్ బాలక్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు.